Salman Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను “ఉగ్రవాది” గా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ‘జాయ్ ఫోరమ్ 2025’ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్‌హిట్ అవుతున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ నుంచి, ఆఫ్గనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి కూడా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు అని అన్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. సల్మాన్ “పాకిస్తాన్” , “బలూచిస్తాన్”ను వేర్వేరుగా ప్రస్తావించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
సల్మాన్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేక చర్యగా పరిగణించిన షెహ్బాజ్ ప్రభుత్వం, ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఆయనను “ఉగ్రవాది”గా ప్రకటించింది. అంతేకాకుండా, సల్మాన్ పేరు నాల్గవ షెడ్యూల్లో చేర్చింది.అయితే ఈ విషయంపై ఇప్పటివరకు సల్మాన్ లేదా ఆయన బృందం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. సల్మాన్ వ్యాఖ్యలు బలూచిస్తాన్ వేర్పాటువాద నేతల్లో మాత్రం ఆనందాన్ని కలిగించాయి.
మీర్ యార్ బలూచ్, బలూచిస్తాన్ స్వతంత్రత కోసం పోరాడుతున్న నాయకుడు కాగా, ఆయన మాట్లాడుతూ.. ప్రధాన దేశాలు మాట్లాడటానికి భయపడుతున్న సమయంలో సల్మాన్ ధైర్యంగా బలూచిస్తాన్ గురించి ప్రస్తావించాడు. 60 మిలియన్ల బలూచ్ ప్రజలు దీనితో సంతోషించారు” అని పేర్కొన్నారు.
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్. ఇది దేశ గ్యాస్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను కలిగి ఉంది. అయితే ఈ ప్రాంతానికి తగిన అభివృద్ధి జరగలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి.అయితే సల్మాన్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేదా అనుకోకుండా మాట్లాడినవా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ ఘటనతో ఆయన పేరు మరోసారి అంతర్జాతీయ రాజకీయ చర్చల్లో నిలిచింది.