దేశం గర్వించదగ్గ నటీమణి, అభినయతార పద్మశ్రీ షావుకారు జానకి(94) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారామె. కొన్ని రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బుధవారం నుంచి ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం షావుకారు జానకి కన్నుమూశారు.
షావుకారు జానకి పూర్వీకులది కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో సెటిల్ అయ్యారు. అక్కడే 1931 డిసెంబర్ 12న షావుకారు జానకి జన్మించారు. ఆమె అసలు పేరు టేకుమళ్ల జానకి. సద్భ్రాహ్మణ కుటుంబంలో జన్మించారామె. తండ్రి టేకుమళ్ల వెంకూజీరావు విప్లవభావాలు కలిగిన వ్యక్తి.. ఉన్నత విద్యావంతుడు. తండ్రి బాటలోనే జానకి కూడా విప్లవభావాలతోనే ఎదిగారు. అంతేకాదు.. తండ్రి లాగే తాను కూడా ఉన్నత విద్యావంతురాలే. ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు జానకి. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఆమె పాలుపంచుకున్నారు. రాజమండ్రిలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కళాశాలలో ఆమె చదువుకున్న రోజుల్లో హిందీ ప్రచారసభకు గాంధీజీ వచ్చారు. ఆయనకు భోజనం, వసతి చూసుకునే బాధ్యతను స్కూల్ యాజమాన్యం జానకికి అప్పగించారు. అలా గాంధీ, నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్ వంటి మహానాయకుల్ని నేరుగా కలుసుకొని మాట్లాడే అవకాశం జానకికి లభించింది. అలనాటి గ్లామర్ క్వీన్ కృష్ణకుమారి స్వయానా జానకి చెల్లెలే.
షావుకారు జానకి తొలినాళ్లలో రేడియో నాటకాల్లో నటించేవారు. పాలగుమ్మి పద్మనాభం రచించిన ‘పట్నవాసం’ ధారావాహిక రేడియో నాటకం ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ నాటకంలోని జానకి గొంతు విని, నచ్చి శంకరమంచి శ్రీనివాసరావు ఆమెను వివాహమాడారు. అలా టేకుమళ్ల జానకి కాస్తా శంకరమంచి జానకిగా మారారు. 15ఏండ్ల చిరుప్రాయంలోనే ఆమెకు వివాహమైంది. రేడియో నాటకంలో ఆమె గొంతువినే దర్శక,నిర్మాత బీఎన్‌రెడ్డి ‘గుణసుందరి కథ’(1949) సినిమాలో ఆమెకు ఆఫర్ ఇచ్చారు. కానీ ఇంట్లోవారు అంగీకరించకపోవడంతో ఆ సినిమాను సున్నితంగానే తిరస్కరించారు జానకి. అయితే.. అదే ఏడాది ‘రక్షరేఖ’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించారామె. అప్పటికే ఆమెకు ఓ బిడ్డ పుట్టడం, సంసార బాధ్యతలు పెరగడం.. ఇత్యాది కారణాలవల్ల ఇల్లు గడవడం కష్టమైంది. దాంతో.. భర్త అనుమతితోనే సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు.
అలా ‘షావుకారు’(1950)తో కథానాయికగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించారామె. అప్పటికే జానకి అనే నటి ఉండటం వల్ల, దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఆమెకు ‘షావుకారు జానకి’గా నామకరణం చేశారు. చివరకు అదే ఆమె పేరుగా మారింది. తన తొలి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకొని దాదాపు 75ఏండ్ల పాటు చలనచిత్ర నటిగా కొనసాగారు షావుకారు జానకి. కథానాయికగా తొలి సినిమా ఎన్టీఆర్‌తో నటిస్తే.. తొలి ఘన విజయం మాత్రం ఏఎన్నార్‌తో దక్కింది. అక్కినేనికి జోడీగా షావుకారు జానకి నటించిన తొలి సినిమా ‘రోజులు మారాయి’(1955). ఆ సినిమా వజ్రోత్సవాలు జరుపుకున్నది. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. అయితే.. కథానాయిక పాత్రకు జానకిని కాక, అంజలిని తీసుకున్నారు. ఈ విషయంలో చాలా బాధపడ్డారు షావుకారు జానకి. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారామె.

ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పడం, అవమానాన్ని, అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని సహించలేకపోవడం షావుకారు జానకి నైజం. తమిళంలో ‘ఒలి విలక్కు’(1968) అనే సినిమాలో కథానాయికగా నటించారు షావుకారు జానకి. ఎమ్జీరామచంద్రన్ కథానాయకుడు. కథలో కీలకమైన ఓ వ్యాంప్ పాత్రను జయలలిత పోషించారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు చిత్రబృందానికి ప్రీమియర్ వేశారు. టైటిల్స్‌లో జయలలిత పేరు ముందు వేయడం చూసి షాకయ్యారు షావుకారు జానకి. ఇందులో కథానాయిక నేనా, జయలలితా? అంటూ ఎమ్జీఆర్‌ని సూటిగా అడిగారు. ఆ చిత్ర దర్శకుడు తాపీ చాణక్య, నిర్మాత వాసన్లు సైతం ఆమె ధైర్యాన్ని చూసి నివ్వెరపోయారు. రాత్రికి రాత్రి టైటిల్స్ మార్చారు. ఈ కారణంగా కొన్నేళ్లు షావుకారు జానకితో జయలలిత మాట్లాడలేదు. ఈ విషయాన్ని ఆమే ఓ సందర్భంలో చెప్పారు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం షావుకారు జానకిది. ఆమె తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఇమేజ్ పరంగా కూడా తమిళనాట ఆమెది సూపర్ స్టార్డమ్. ఒక్క బాలచందర్ దర్శకత్వంలోనే దాదాపు 12 సినిమాల్లో కథానాయికగా నటించారామె. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. ఆమె తమిళంలో నటించిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అక్కడ జానకి పోషించిన పాత్రలను ఇక్కడ వేరే నటీమణులు పోషించేవారు. తనను మాత్రం పిలిచేవారు కాదు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారామె. కన్నడంలోనూ ఎన్నో గొప్ప పాత్రలు పోషించిన జానకి, బాలీవుడ్‌లోనూ మూడు సినిమాల్లో నటించారు. కెరీర్ మొత్తం మీద 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు.
ఎన్నో అద్వితీయ పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన మహానటి షావుకారు జానకిని ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. 2022లో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎమ్జీఆర్ అవార్డు, కలైమామణి పురస్కారాలు, కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ పురస్కారం, సైమా జీవిత సాఫల్య పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్, మహానటి సావిత్రి అవార్డు, అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, శివాజీగణేశన్ జీవిత సాఫల్యపురస్కారం.. ఇవిగాక రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులెన్నో షావుకారు జానకిని వరించారు. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా ‘అన్నీ మంచి శకునములే’.

దర్పం, ఆత్మాభిమానాన్ని ధన్వించే కంఠం.. ఎత్తు అయిదడుగులే అయినా ఆకాశమంత హుందాతనం.. నటదిగ్గజాలకు దీటైన అభినయ కౌశలం.. వెరసి షావుకారు జానకి. ఎన్ని భాషల్లో ఎన్నెన్ని గొప్ప పాత్రలు పోషించినా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె ప్రత్యేకం. ఇన్నాళ్లూ తన అభినయంతో, కంచు కంఠంతో ప్రేక్షకులకు అలరించిన ఈ నటవిదుషీమణి ఇకనుంచి జ్ఞాపకం. సినిమా బతికున్నంతవరకూ ఈ జ్ఞాపకం పదిలం.
ఎన్టీఆర్ తొలి హీరోయిన్గా గుర్తింపు పొందారు షావుకారు జానకి. నిజానికి ఆ క్రెడిట్ అంజలికి దక్కాలి. ఎందుకంటే.. ‘పల్లెటూరి పిల్ల’లో నటించేందుకు దర్శకుడు బీఏ సుబ్బారావు నుంచి పిలుపు రావడంతో మద్రాస్ వెళ్లారు ఎన్టీఆర్. ఆ సినిమా కథానాయిక అంజలి. కానీ ఆ సినిమాకంటే ముందే ‘షావుకారు’ పూర్తయి, విడుదలైంది. ఆ విధంగా ఎన్టీఆర్ తొలి హీరోయిన్గా అంజలికి దక్కాల్సిన క్రెడిట్ ‘షావుకారు’ కథానాయిక జానకికి దక్కింది. అందుకే అప్పట్నుంచి షావుకారు జానకి అంటే ఎన్టీఆర్‌కు ఓ సెంటిమెంట్. ఎన్టీఆర్ ఎన్ఏటీ సంస్థను స్థాపించి, సంస్థ లోగోలో తన ఇష్టదైవం వేంకటేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవిలలో ఒకరిగా షావుకారు జానకినే కూర్చోబెట్టారు. ఎన్ఏటీ బ్యానర్‌పై ఎన్టీఆర్ నిర్మించిన సినిమాలన్నింటిలో ప్రథమంగా దేవతారూపంలో షావుకారు జానకే సాక్షాత్కరిస్తారు. అంతేకాదు ఆ సంస్థలో ఎన్టీఆర్ నిర్మించిన తొలి సినిమా ‘పిచ్చిపుల్లయ్య’లో కూడా ఆమె ఓ ముఖ్య పాత్ర పోషించారు. షావుకారు జానకి తెలుగులో ఎక్కువ చిత్రాలు ఎన్టీఆర్ సరసనే నటించడం విశేషం. షావుకారు, పిచ్చిపుల్లయ్య, వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, రేచుక్క-పగటిచుక్క, జయం మనదే, పెంపుడు కూతురు తదితర చిత్రాల్లో ఆమె ఎన్టీఆర్‌తో కలిసి నటించారు. ఎన్టీఆర్ ‘పాండురంగ మహత్మ్యం’, ‘శ్రీవేంకటేశ్వరమహత్మ్యం’ చిత్రాల్లోనూ ఓ ప్రత్యేమైన పాత్రలు పోషించారు.
తన కెరీర్లో గుర్తుండిపోయే ఎన్నో గొప్ప పాత్రలను పోషించారు షావుకారు జానకి. వాటిలో ‘కన్యాశుల్కం’లోని బుచ్చమ్మ పాత్ర ఒకటి. బాల్య వివాహానికి బలై వితంతుగా జీవితాన్ని సాగిస్తున్న బుచ్చమ్మగా ఆమె అభినయాన్ని తెలుగుప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు. గురజాడ అప్పారావు సృష్టించిన ఆ పాత్రకు తన నటనతో జీవం పోశారు షావుకారు జానకి. ఇక ఆమె కెరీర్లో మరో మైలురాయి ‘నాగుల చవితి’ సినిమా. ఇందులో ఆమె పోషించిన మానసాదేవి పాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. నెగెటివ్ షేడ్స్‌తో సాగే ఆ పౌరాణిక పాత్రలో షావుకారు జానకి అభినయం అద్భుతం.
‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంలో అసూయతో రగలిపోయే భార్యగా నటించారామె. ఆ సినిమాలో సావిత్రి ఎంత గుర్తుంటారో, షావుకారు జానకి అంత గుర్తుంటారు. ఇక ఎన్టీఆర్ ‘వేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రంలో ఆమె పోషించిన ఎరుకలసాని పాత్ర నిజంగా మెమరబుల్. నిజంగా శ్రీనివాసుడే ఎరుకలసానిగా వస్తే ఎలా ఉంటుందో తన అభినయంతో చూపించారు జానకి. ఇక ‘అక్కాచెల్లెళ్లు’ చిత్రంలో వయసు ముదిరిన శోభనం పెళ్లికూతురుగా ‘పాండవులు పాండవులు తుమ్మెదా..’ అంటూ ఆమె చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను నవ్వుల పర్యంతం చేసింది. ఇక ‘మంచి మనసులు’ చిత్రంలో అంధురాలిగా, ‘సంసారం ఒక చదరంగం’లో పనిమనిషి చిలకమ్మగా, ‘ఆడదే ఆధారం’లో కూతురుకి బుద్ధిచెప్పే తల్లిగా.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో.. మణిరత్నం ‘గీతాంజలి’లో కాలేజ్ ఛాన్స్‌లర్‌గా ఒకేఒక్క సన్నివేశంలో కనిపించి కూడా గుర్తుండిపోయారామె.

ఇక అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలోనే ఓ గొప్ప క్లాసిక్‌గా చెప్పుకునే ‘దేవదాసు’ చిత్రంలో పార్వతి పాత్రకు ముందు అనుకున్నది షావుకారు జానకినే. ఆమెతో ఓ పాటకు సంబంధించిన రిహార్సల్స్ కూడా నిర్వహించారు దర్శకనిర్మాతలు వేదాంతం రాఘవయ్య, డిఎల్ నారాయణ. కానీ ఉన్నట్టుండి ఆ పాత్ర నుంచి ఆమె తప్పించి సావిత్రిని తీసుకున్నారు. ఈ వార్త పేపర్లో చూసి షాకయ్యారు షావుకారు జానకి. ఈ విషయాన్ని కూడా పలు సందర్భాల్లో
వెల్లడించారామె.
‘నటిగా ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రలకు, సహజమైన నటనకు చిరునామాగా నిలిచారు షావుకారు జానకి. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం’
‘షావుకారు జానకి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆమెది చిరస్మరణీయమైన సినీ ప్రస్థానం. పద్మశ్రీ, కళైమామణి, నంది వంటి పురస్కారాలను అందుకున్నారు. షావుకారు జానకి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’
‘జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా నటించిన ‘షావుకారు’ చిత్రంతోనే ఆమె ‘షావుకారు జానకి’గా ప్రసిద్ధులయ్యారు. నాన్నగారితో ఎన్నో చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ‘పాండురంగ మహాత్మ్యం’ నుంచి యన్.ఏ.టి బ్యానర్ లోగోలో ఆమె ఫొటో పెట్టాం. ‘రామ్-రహీమ్’ ‘వేములవాడ భీమకవి’ చిత్రాల్లో షావుకారు జానకితో నటించే అవకాశం నాకు దక్కింది’
‘నాకు తల్లిగా ఎన్నో చిత్రాల్లో నటించారామె. నా గురువు కె.బాలచందర్‌కు ఆమె అంటే ఎంతో గౌరవం. ఆ మాతృమూర్తి ఇకలేరు. ఆమె రూపం కనుమరుగైంది. ఆమెకు కన్నీటి వీడ్కోలు’
‘సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి జానకి. 400 చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’
‘షావుకారు జానకి పోషించిన పాత్రలు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’