పాతాళ్ లోక్ 2
అమెజాన్ ప్రైమ్ : జనవరి 17
తారాగణం: జైదీప్ అహ్లవత్, ఇష్వాక్ సింగ్, గుల్ పనాగ్, అనురాగ్ అరోరా, తిలోత్తమ షోమీ తదితరులు
దర్శకత్వం : అవినాశ్ అరుణ్, ప్రోసిత్ రాయ్
ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్.. ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సీజన్ల మీద సీజన్లు తెరకెక్కుతున్నాయి. మొదటి సీజన్‌కు మించి హిట్‌టాక్ తెచ్చుకుంటున్నాయి. అలా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఐదేళ్ల క్రితం వచ్చిన ‘పాతాళ్ లోక్’కు కొనసాగింపుగా వచ్చిందే.. పాతాళ్ లోక్-2. కథ విషయానికి వస్తే.. హథీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) పోలీస్ అధికారి. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడమే అతని అలవాటు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు కూడా. దాంతో ఉన్నతాధికారులు అతనిపై అసహనంతో ఉంటారు. హథీరామ్ జూనియర్ అయిన ఇమ్రాన్ అన్సారీ (ఇష్వాక్ సింగ్) సివిల్స్ పాసై ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. ఇలా ఉండగా.. ఒకరోజు ఒక యువతి స్టేషన్‌కి వచ్చి, తన భర్త కొన్నిరోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది.
మరోవైపు నిత్యం ఆందోళనలతో అట్టుడికిపోతున్న నాగాలాండ్‌లో శాంతి స్థాపన చేసి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ కొంతమంది నాగాలు ఢిల్లీ వస్తారు. వారిలో కీలక వ్యక్తి అయిన జొనాథన్ థామ్ (కగురోంగ్ గోన్మీ)ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేస్తారు. ఈ కేసు విచారణ బాధ్యతను యువ ఐపీఎస్ అయిన ఇమ్రాన్ అన్సారీకి అప్పగిస్తారు ఉన్నతాధికారులు. మరి ఈ హత్య కేసు విచారణలోకి హథీరామ్ ఎలా వస్తాడు? థామ్ హత్య వెనక ఉన్నది ఎవరు? విచారణ కోసం నాగాలాండ్ వెళ్లిన హథీరామ్-అన్సారీకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది కథ. ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.