‘ఇది నిజాయితీ గల జర్నలిస్టు కథ. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ పాత్రలో హిందోళ చక్రవర్తి నటిస్తున్నది. అమెది లీడ్‌రోల్. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చినవారెవరో చెప్పి జనాన్ని హెచ్చరించే పాత్ర అమెది. ఆ హెచ్చరికల వల్ల జనం ఎలా అప్రమత్తమయ్యారు? పాలకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనేది ఈ కథలో ఆసక్తికరంగా ఉంటుంది’ అని పోసాని కృష్ణమురళి చెప్పారు.
ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, అయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందనరావు కీలక పాత్రధారులు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో పోసాని కృష్ణమురళి పై విధంగా స్పందించారు.
ఇంకా చెబుతూ ‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఓ జర్నలిస్టు కొందరి రాజకీయాలకు బలై రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తే, ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు అండగా నిలుస్తాడు. ఇది వందశాతం సిన్సియర్‌గా తీసిన సినిమా. ఇందులో పాలిటిక్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. బెస్ట్ స్క్రీన్‌ప్లే అవుతుందని వందశాతం చెప్పగలను.
అన్ని వర్గాల ప్రజలూ, అన్ని రాజకీయ పార్టీలు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు. వారందరికీ నచ్చే సినిమా ఇది. అశ్లీల పదాలుగానీ, అసభ్యకర సన్నివేశాలు కానీ ఈ సినిమాలో ఉండవు’ అని పోసాని తెలిపారు. ఇంకా కథానాయిక హిందోళ చక్రవర్తి కూడా మాట్లాడారు. ఈచిత్రానికి కెమెరా: సుధాకర్, సంగీతం: మహదేవ్ ఏలేందర్, కథ, కథనం, మాటలు, పాటలు, ఎడిటింగ్, నిర్మాణం, దర్శకత్వం: పోసాని కృష్ణమురళి, సమర్పణ: 3 ఇడియట్స్ మూవీస్, నిర్మాణం: యూపీ సినిమా లైన్స్, కుసుమ ఎంటర్టైన్మెంట్స్.