K Vishwanath | తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుల లిస్టు ఒకటి బయటకు తీస్తే.. అందులో అందరికంటే ముందు వరుసలో ఉండే దర్శక దిగ్గజం కె విశ్వనాథ్. సినిమా అంటే కేవలం కమర్షియల్ అంశాలు, హీరోయిన్ల అందాల ఆరబోత, మాస్ మసాలా ఫార్ములా, ఆరు పాటలు నాలుగు కామెడీ సీన్లు అనే రొటీన్ ట్రాక్ కాకుండా సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి.. సినిమా నుంచి ప్రపంచానికి మన సంస్కృతి సాంప్రదాయాలు చూపించాలని ఆరాటపడిన దర్శకుడు కె విశ్వనాథ్.
సినిమా అనే గుడిలో నేను ఒక పూజారిని.. ఎప్పుడూ దేవుడికి నైవేద్యం పెట్టినంత అందంగా ఒక సినిమా తీయాలి అని చెబుతూ ఉండేవాడు కళాతపస్వి. అలాంటి అద్భుతమైన దర్శకుడు కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలున్నాయి. అంత గొప్ప దర్శకుడు ఫిబ్రవరి 2న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కెరీర్లో 50 పైగా సినిమాలు తీసిన కే విశ్వనాథ్.. అద్భుతమైన విజయాలు ఎన్నో అందుకున్నాడు.
అయితే ఈయన కెరీర్ లో కూడా ఒకటి విడుదల కాని సినిమా ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా పేరు సిరిమువ్వల సింహనాదం. తన సినిమాలకు స అనే అక్షరంతో టైటిల్స్ పెట్టడం కె విశ్వనాథ్ కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. శంకరాభరణం, సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వయంకృషి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు స అనే అక్షరంతో వచ్చాయి. అలా వచ్చిన సినిమానే సిరిమువ్వల సింహనాదం. మాధవి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఇది కూడా సంగీతం నేపథ్యంలోనే తెరకెక్కించాడు కళాతపస్వి. కాకపోతే అనివార్య కారణాల వల్ల సినిమా పూర్తయినా కూడా విడుదలకు నోచుకోలేదు.
Read More: “తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం శంకరాభరణం.. ఈ సినిమా తెచ్చిన అవార్డులు ఇవే”
కూచిపూడి నేర్చుకున్న హీరో… స్టేజ్ మీద భామా కలాపం అద్భుతంగా చేస్తాడని ఆయనకు మంచి పేరు ఉంటుంది. వాళ్ల అమ్మలా ఉంటాడని ఎప్పుడు ఆడ పాత్రలే చేస్తూ ఉంటాడు హీరో. అదే సమయంలో మరదలితో పెళ్లి అనుకుంటారు పెద్దలు. మరదలు వద్దు అంటుంది. కారణం స్టేజ్ మీద ఆడ పాత్రలు వేసే మనిషిని పెళ్లాడను అంటుంది.
అంతలోనే ఆ అమ్మాయి జీవితంలో ఒక ఊహించరాని మలుపు. ఓ ఎంపీ కొడుకు తనను పాడు చేస్తాడు. ఆ ఎంపిని చంపేయాలి అన్నంత కోపం వచ్చినా ఆ అమ్మాయి హీరో అనుకున్న వాడు ఒద్దు అంటాడు. కానీ డాన్సర్ ఊరుకోడు.
దీపావళికి సత్యభామ విజయంగా భావించేలా వేస్తున్న నృత్య సంప్రదాయంలో భాగంగా ఆ ఎంపిని చంపేస్తాడు. అదే సిరిమువ్వల సింహనాధం చిత్రకథ కె.వి మహదేవన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. అంతా బానే ఉన్నా అప్పుడున్న పరిస్థితుల కారణంగా సిరిమువ్వల సింహనాదం థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు.
కానీ ఖచ్చితంగా ఈ సినిమాను థియేటర్లో ఒక్కసారైనా విడుదల చేయాలి అని కె విశ్వనాథ్ చివరి వరకు ప్రయత్నించాడు. అది చూడకుండానే ఆయన వెళ్లిపోయాడు. కానీ ఆయనను అభిమానించే వాళ్లకు అతడి కెరీర్ లో ఒక విడుదల కాని సినిమా ఉందని విషయం కూడా చాలామందికి తెలియదు.