Barkha Madan | బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి ఆమె. మోడల్‌గా, నటిగా కెరీర్ ప్రారంభించి, సినీ ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పుడు అక్షయ్‌కుమార్, రేఖలతో కలిసి ‘ఖిలాడియోంకా ఖిలాడి’ సినిమాలో నటించిన ఈ భామ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సినిమాలు, పేరు, డబ్బు అన్నీ వదిలేసి బౌద్ధ సన్యాసిగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు బర్ఖా మదన్. 1994లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా గుర్తింపు పొందిన బర్ఖా.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1996లో వచ్చిన ‘ఖిలాడియోంకా ఖిలాడి’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘భూత్’, ‘సోన్’ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.
దాదాపు 20కు పైగా సినిమాల్లో నటించి, టెలివిజన్ షోల్లోనూ రాణించారు. అయితే, సినిమా ప్రపంచం ఆమెకు ఆత్మసంతృప్తిని ఇవ్వలేకపోయింది. జీవితంలో ఏదో లోపించిందనే భావన ఆమెను వేధించింది. ఈ నేపథ్యంలో ఆమె బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించి, సన్యాసాన్ని స్వీకరించారు. ప్రస్తుతం ఆమె పేరు వెనరబుల్ గ్యాల్టెన్ సామ్టెన్. హిమాలయాల శాంతమైన ప్రాంతంలో ఉన్న ఓ బౌద్ధ ఆశ్రమంలో నివసిస్తూ.. ధ్యానం, ఉపన్యాసాలు, సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక మార్గంలో తన జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు వెలుగుల్లో కనిపించిన నటి ఇప్పుడు ప్రశాంతతలో జీవిస్తున్న సన్యాసిని. బర్ఖా మదన్ కథ సినీ ప్రపంచం నుంచే కాదు.. సమాజంలో ఆత్మశాంతిని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోన్నది.