NTR -Neel | రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌ను భారీ ఈవెంట్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమా ప్రమోషన్స్‌కు ఇది కొత్త నిర్వచనంగా మారింది. ఈ వినూత్న ప్రయత్నం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, హాలీవుడ్ మీడియా దృష్టిని కూడా ఆకర్షించి గ్లోబల్ లెవెల్లో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా టైటిల్స్‌ను పోస్టర్, గ్లింప్స్ లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రకటిస్తారు. కానీ వారాణాసి యూనిట్ మాత్రం పాత్రలు, కథ, థీమ్ వివరించే క్రమంలో స్టేజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రమోషన్లో కొత్త మైలురాయి సృష్టించింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమాకి ఉపయోగించనున్నట్టు అర్ధమవుతుంది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్‌పై భారీ ఆసక్తి నెలకొనగా, మూవీకి డ్రాగన్ అనే పేరు ఖరారు చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే డ్రాగన్’ పేరు ఇంకా నిర్ధారణ కాలేదని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి శంకర్ స్పష్టం చేశారు. “డ్రాగన్ కూడా ఓ ఆప్షన్ మాత్రమే. అధికారికంగా ఏ టైటిల్ ఫైనల్ కాలేదు. ఇది పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్. ప్రశాంత్ నీల్ విజన్‌లో ఎన్టీఆర్ కొత్త అవతరం చూపించబోతున్నాడు. టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వారణాసి మాదిరిగానే ప్రాజెక్ట్‌కి తగ్గ స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని తెలిపారు.
గ్రాండ్ ఈవెంట్‌ను ఎంచుకోవడానికి కారణం.. ఫిల్మ్ ప్రమోషన్లో భారీ ఈవెంట్ మోడల్ ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తోంది. సినిమా థీమ్‌ను స్పష్టంగా ప్రేక్షకులకు చెప్పే అవకాశం కలుగుతుంది. ఇలా చేస్తే గ్లోబల్ ఆడియన్స్‌ను చేరుకునే అవకాశం ఉంటుంది. హాలీవుడ్ మీడియా సహా విదేశీ ప్రెస్ అటెన్షన్, తక్కువ సమయంలో భారీ బజ్ క్రియేట్ చేయగలగడం, కంటెంట్‌పై తప్పుదారులు వెళ్లకుండా క్లారిటీ ఇవ్వడం కొత్త ట్రెండ్‌ను ఆమోదించేలా చేశాయి. వారణాసి ఈవెంట్ తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో ‘టైటిల్ రివీల్ ఈవెంట్’ అనే కొత్త ప్రమోషనల్ ట్రెండ్ ప్రారంభమైంది. అదే మోడ్‌లో ఎన్టీఆర్ – నీల్ ప్రాజెక్ట్ కూడా అడుగులు వేస్తుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.