NTR | జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించగా, ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. తారక్, హృతిక్ లతో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, దిల్ రాజు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తన స్పీచ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా తన తొలి అభిమానిని పరిచయం చేయడం విశేషం.25 ఏళ్ళ క్రితం నిన్ను చూడాలని సినిమాతో నా కెరీర్ మొదలు పెట్టాను. కీర్తిశేషులు రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే నా తొలి మూవీ ఓపెనింగ్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు నా పక్కన మా అమ్మ, నాన్న తప్ప ఎవరు లేరు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అయితే నా మొదటి అభిమాని ముజీబ్ ఇక్కడే ఎక్కడో ఉంటాడు. నా మొదటి సినిమా ప్రారంభం అయినప్పుడు మెహదీపట్నంలో ఉన్న ఇంట్లో ఉండేవాడిని. అక్కడే రెంట్ ఆఫీస్ తీసుకున్నాను. అప్పుడు ముజీబ్ నా ఆఫీస్ కి వచ్చి నా ఫ్యాన్ అన్నాడు. నేనంటే పడి చచ్చిపోతా అని చెప్పడంతో షాక్ అయ్యాను.
నా సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు.నాకు అప్పుడే ఫ్యాన్ ఏంటి అని అనుకున్నాను. ఇక నుండి నేను మీతోనే ఉంటానని ముజీబ్ అన్నాడు. అప్పటి నుండి నాతోనే ఉన్నాడు. అలా ముజీబ్ తర్వాత ప్రేమని పంచే చాలా మంది అభిమానులు వచ్చారు. 25 ఏళ్లలో నాతో కలిసి ఎంతో మంది వచ్చారు.నా మీద ప్రేమని పంచుకున్నారు అని ఎన్టీఆర్ చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. వార్ 2 ఈవెంట్ వేదికగా ఎన్టీఆర్ తన తొలి అభిమానిని పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాలతో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సూర్యదేవర నాగవంశీకి కూడా థ్యాంక్స్ చెప్పారు ఎన్టీఆర్.