NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినమాతో జూనియర్‌కి దేశ విదేశాలలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తారక్‌కి ఆఫ్ఘనిస్తాన్లోను విపరీతమైన క్రేజ్ ఉందట. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రాన్ని ఆఫ్ఘన్‌కి చెందిన కుర్రాడు యూట్యూబ్‌లో చూస్తుండగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ తెలుగు యూట్యూబర్ ఆఫ్ఘనిస్తాన్ టూర్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. బస్సులో ట్రావెలింగ్ చేస్తూ ఆఫ్ఘన్ కుర్రాడు ఎన్టీఆర్ సినిమా చూస్తున్న సమయంలో యూట్యూబర్ ఎన్టీఆర్ గురించి అడిగాడట.
దానికి ఆఫ్ఘనిస్తాన్ కుర్రాడు మా దేశంలో ఎన్టీఆర్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది ఆయన సినిమాలు హిందీలో చూస్తాము. దాదాపు అన్ని సినిమాలు మిస్ కాకుండా చూస్తామని అన్నారట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఎన్టీఆర్‌ను మరో కొత్త మాస్ అవతారంలో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. రిలీజ్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ షాడో లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20, 2026న గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇది కేవలం హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రమే కాకుండా, ప్రశాంత్ నీల్ శైలిలో బలమైన భావోద్వేగాలతో కూడిన కథగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన జిమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో అంచనాలను పెంచాయి.