ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు చాంబర్ నూతన అధ్యక్షునిగాగా ఎన్ని ఏకగ్రీవంకయ్యారు. మరో నిర్మాత కె.అశోక్‌కుమార్ కార్యదర్శిగా, యువ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, భారత్ చౌదరి ఉపాధ్యక్షులుగా, మోహన్ వడ్లపట్ల, విజయేందర్‌రెడ్డి సంయుక్త కార్యదర్శులుగా, ముత్యాల రామదాసు కోశాధికారి ఎంపికయ్యారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్, మధ్యహ్నం ఒంటిగంట వరకూ కొనసాగింది.
‘మన ప్యానల్’ పేరిట చిన్న నిర్మాతలు, ‘ప్రొగెసివ్ ప్యానల్’ పేరుతో పెద్ద నిర్మాతలు ఈ ఎన్నికల్లో తలపడ్డారు. మొత్తం 3,335మంది సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొనగా, కార్యవర్గ సభ్యులుగా రెండు ప్యానల్స్ నుంచీ 48మంది పోటీ చేశారు. వారిలో ‘ప్రొగ్రెసివ్ ప్యానల్’ నుంచి 31మంది, ‘మన ప్యానల్’ నుంచి 17 మంది గెలుపొందారు. అగ్రనిర్మాతలతో కూడిన ‘ప్రొగ్రెసివ్ ప్యానల్’ నుంచి మెజారిటీ సభ్యులు గెలుపొందగా.. వారంతా కలిసి చాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత డి.సురేష్‌బాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గం 2027 వరకూ కొనసాగనున్నది.