‘ఇందులో నా పాత్రపేరు బుజ్జి. డబ్బున్న కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయిని. ఇది 90ల్లో జరిగే కథ కావడంతో అప్పటి అమ్మాయిల్లో ఉండే అందం, సౌమ్యగుణంతోపాటు మానసిక ధృఢత్వం నా పాత్రలో ఉంటుంది. ఒక అమ్మాయిలో వుండే భావోద్వేగాలన్నీ నా పాత్రలో ఉంటాయి.’ అని నేహా శెట్టి అన్నారు. విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నేహా శెట్టి ఓ కథానాయిక. కృష్ణచైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేహా విలేకరులతో ముచ్చటించింది. ‘రత్న, రత్నమాల, బుజ్జి.. ఈ మూడు పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇదొక జీవితం. ఇందులో యాక్షన్‌తోపాటు రొమాన్స్, కామెడీ, డ్రామా అన్నీ ఉంటాయి.’ అని చెప్పింది నేహా శెట్టి. ఇంకా మాట్లాడుతూ ‘ఇందులో నా చీరకట్టు, జుత్తు, కళ్ల కాటుక.. ఇలా ప్రతి దానిపై డైరెక్టర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నాటి నాయిక శోభన గారిని రిఫరెన్స్‌గా చూపించారు. అప్పటి నటీమణుల అభినయాన్ని తెలుసుకొని, దానికి తగ్గట్టుగా కళ్లతోనే అభినయించా. ఇప్పటివరకూ మోడ్రన్ పాత్రలే చేసిన నాకు బుజ్జి ఓ ప్రత్యేకమైన పాత్ర.’ అని నేహ చెప్పింది. విశ్వక్సేన్, అంజలిలతో నటించడం ఓ గొప్ప అనుభూతి అని, వారిద్దరూ తనకు మంచి స్నేహితులైపోయారని ఆమె తెలిపింది.