ప్రముఖ నటి, మోడల్ నేహా ధూపియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లి అయిన తర్వాత కూడా ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ హాట్ బ్యూటీ. ప్రెగ్నెన్సీ, డెలివరీ అనంతర పరిణామాలతో 25 కిలోల వరకు బరువు పెరిగిన నేహ.. వర్కవుట్లు, డైట్‌తో దాదాపు 23 కిలోలు తగ్గింది. అయితే, బరువు తగ్గడంలో తన టార్గెట్‌ను ఇంకా చేరుకోలేదని అంటున్నది. 2000 సంవత్సరంలో జపనీస్ సినిమాతో తెరపైకి వచ్చి తెలుగు, హిందీ, పంజాబీ, ఉర్దూ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది నేహ.
ఆమె నటించిన కామెడీ సినిమా ‘బ్యాడ్ న్యూస్’ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో కొన్ని సంగతులు షేర్ చేసుకుంది. ‘2018లో అంగద్ బేడీని పెండ్లి చేసుకున్నాను. మెహర్ (మొదటి సంతానం)కు జన్మనిచ్చిన తర్వాత కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంటి దగ్గరే ఉన్నాను. డైట్ పాటించి బరువు తగ్గాను. మరో మూడేండ్లకు మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. దాంతో మళ్లీ బరువు పెరిగాను. డెలివరీ తర్వాత లావుగా అవుతానా లేదా అనే దాని గురించి ఆలోచించలేదు.
పిల్లలకు ఏడాది వచ్చేవరకు వారికి పాలిచ్చాను. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టలేదు. 25 కిలోల వరకు బరువు పెరగడంతో సినిమా ఆఫర్లు రాలేదు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఏకంగా 23 కిలోలు తగ్గాను. ఇందుకోసం నేను పెద్దగా కష్టపడింది లేదు. రన్నింగ్ చేసేదాన్ని. జిమ్‌కు వెళ్లాను. షుగర్, ఫ్రై లాంటి వాటిని డైట్లో లేకుండా చూసుకున్నాను. రాత్రి 7 గంటలకు డిన్నర్ పూర్తి చేసేదాన్ని. ఇప్పటికీ ఇవే ఫాలో అవుతున్నా. బరువు తగ్గి ఫిట్‌గా మారిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయ్’ అని చెప్పుకొచ్చింది నేహ.