కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్బీకే 109’ చిత్రం ఈ దసరాకి విడుదల చేయడానికి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాలయ్య విజయపరంపరను కొనసాగించడం ఖాయమని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చిన బాలయ్య.. మళ్లీ లొకేషన్లోకి అడుగుపెట్టనున్నారు.
సోమవారం బాలకృష్ణ పుట్టినరోజు. 64ఏళ్లు నిండి 65లోకి అడుగుపెట్టారాయన. ఈ సందర్భంగా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. బాలకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ.. ‘జాలి.. దయ.. కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు’ అంటూ ఓ పవర్ఫుల్ డైలాగ్‌ని రివీల్ చేశారు. ఈ గ్లింప్స్‌ను బట్టి ఇందులో బాలయ్య పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండబోతున్నదని తెలుస్తున్నది.
ఇదిలావుంటే.. ఈ పుట్టినరోజు సందర్భంలోనే అభిమానులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న బాలయ్య-బోయపాటి సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. ‘బీబీ4’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని ఈ చిత్రానికి సమర్పకురాలు కావడం విశేషం. అయితే.. ఇది ‘అఖండ2’నా?, లేక వేరే కథా? అనేది మాత్రం తెలియాల్సి వుంది.