‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది అగ్ర కథానాయిక నయనతార. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘చంద్రముఖి’ ‘గజిని’ చిత్రాలు ఆమె కెరీర్‌ను మలుపుతిప్పాయి. ఇక అక్కడి నుంచి దక్షిణాదిలో అగ్ర నాయికగా చెలామణీ అయింది. అభిమానులు ఆమెను లేడీసూపర్‌స్టార్ అని ప్రేమగా పిలుస్తుంటారు. నయనతార ఇండస్ట్రీకి వచ్చి నేటితో 22 ఏండ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఈ భామ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్‌ను విడుదల చేసింది. ‘నేను కెమెరా ముందుకొచ్చి 22ఏండ్లు గడచిపోయాయి. ఈ ప్రయాణం ఇంతదూరం సాగుతుందని అస్సలు ఊహించలేదు. ఇండస్టీకి వచ్చిన తర్వాతే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరిణితి లభించింది. ఇక్కడే ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా. ఓ రకంగా సినీరంగం నాలో ధైర్యాన్ని నింపింది. నన్ను కొత్తగా పరిచయం చేసింది. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికి కృతజ్ఞతలు’ అని నయనతార పేర్కొంది.