అసత్య ఆరోపణలతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ తన మాజీ భార్య ఆలియా, సోదరుడు షంషూద్దీన్పై ముంబయి హైకోర్టులో వందకోట్ల పరువు నష్టం దావా వేశారు బాలీవు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఈ కేసు ఈ నెల 30న విచారణకు రానుంది. దాదాపు పన్నెండేండ్ల క్రితం తన సోదురుణ్ణి వ్యక్తిగత మేనేజర్‌గా నియమించుకున్నారు నవాజుద్దీన్. అప్పటి నుంచే అతను అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, అక్రమంగా ఆస్తుల్ని సంపాదించుకున్నారని నవాజుద్దీన్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
తన భార్య సహకారంతో సోదరుడు షంషూద్దీన్ దాదాపు 30 కోట్ల మోసానికి పాల్పడ్డారని నవాజుద్దీన్ సిద్దిఖీ ఆరోపిస్తున్నారు. ఆ డబ్బును తిరిగి ఇప్పించేలా ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. గత కొద్దినెలలుగా మాజీ భార్య ఆలియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ మధ్య విడాకులు, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరు అనేక సందర్భాల్లో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.