‘ఇది యువతరం మెచ్చే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాధారణంగా ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి అంటే ఎవరైనా ముక్కోణపు ప్రేమకథ అనుకుంటారు. కానీ ఇది ఆ తరహా సినిమా కాదు. కొత్త పాయింట్. అది ఇప్పుడే రివీల్ చేయడం కరెక్ట్ కాదు. తెరపైనే చూడాలి’ అంటున్నారు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానున్నది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ అబ్బరాజు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
‘ఇందులో శర్వా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా, మహానుభావుడు చిత్రాలను మించి ఇందులో ఆయన ఎంటర్టైన్ చేస్తారు. అలాగే నా ‘సామజవరగమన’ మాదిరిగానే ఇందులోనూ సీనియర్ నరేష్ పాత్ర హైలైట్ అవుతుంది. ఇందులో హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాధానత్య ఉంటుంది’ అని తెలిపారు రామ్ అబ్బరాజు.
సిట్యువేషనల్ కామెడీ కావడంతో అందరికీ ఆర్గానిక్‌గా నవ్వులు వస్తాయనీ, సత్య, సుదర్శన్, వెన్నెలకిశోర్ పాత్రలు హిలేరియస్‌గా కుదిరాయని, అలాగే ైక్లెమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుందని రామ్ అబ్బరాజు చెప్పారు. ‘నేను సరదాగా ఉంటాను. నా సినిమా కూడా సరదాగా ఉండాలని కోరుకుంటాను. థియేటర్లో అందరితో కూర్చొని నవ్వడం మంచి అనుభూతి. అలా నవ్వించడంలో దర్శకుడికి ఓ సంతృప్తి ఉంటుంది. ఇందులో ఓ అతిథి పాత్ర ఉంది. శ్రీవిష్ణు నాకు మంచి ఫ్రెండ్. అందుకే అడగ్గానే కాదనకుండా చేశారు. నా నెక్ట్స్ సినిమా హీరో కూడా శ్రీవిష్ణునే’ అని తెలిపారు రామ్ అబ్బరాజు.