Nara Rohith | టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి సిరి (శిరీష లెల్లా) తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఇద్దరూ గతంలో ‘ప్రతినిధి–2’ సినిమాలో కలిసి నటించారు. సినిమా షూటింగ్ సమయంలో మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణించడం వల్ల వివాహ వేడుకలు వాయిదా పడ్డాయి. ఇక రీసెంట్గా పెళ్లి తేదిని ఖరారు చేశారు. రోహిత్–శిరీష వివాహం అక్టోబర్ 30న హైదరాబాద్లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.
నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 25న హల్దీ వేడుకను, 26న సంప్రదాయ పెళ్లికొడుకు కార్యక్రమాన్ని, 28న మెహందీ వేడుకను గ్రాండ్గా నిర్వహించనున్నారు. చివరగా, అక్టోబర్ 30న రాత్రి 10.35 నిమిషాలకు ప్రధాన వివాహ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. నారా కుటుంబ సభ్యులు ఈ వివాహ వేడుకను ఆనందోత్సాహాలతో, స్టార్ల హాజరుతో మరపురాని వేడుకగా మార్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నారా రోహిత్ స్వయంగా వెళ్లి ఇటు రాజకీయ ప్రముఖులతో పాటు అటు సినీ ప్రముఖులని తన వివాహానికి ఆహ్వానిస్తున్నారు.
కొద్ది సేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభలేఖ అందించారు. 30న జరగనున్న తన వివాహానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, గత ఏడాది అక్టోబర్లో ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. ఆ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై ఆశీర్వదించారు.ఇప్పుడు రోహిత్ – శిరీష అక్టోబర్ 30న వివాహ బంధంలో అడుగుపెట్టబోతుండటంతో, నారా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.