Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తారకరత్నను ప్రాణాలతో కాపాడేందుకు నారాయణ హృదయాలయ వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని తెలియడంతో.. శనివారం సాయంత్రం వరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. యాత్ర ప్రారంభమైన కాసేపటికి సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేశ్ వెళ్లారు. లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు అంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరి ఆడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్లు.. టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందించారు. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు తారకరత్న.