అగ్ర నటుడు బాలకృష్ణ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ-2’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సందర్భంగా బుధవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ..మద్రాస్‌ను తన జన్మభూమిగా, తెలంగాణను కర్మభూమిగా, ఆంధ్రప్రదేశ్‌ను ఆత్మభూమిగా అభివర్ణించారు. సినీరంగంలోకి వచ్చి యాభైఏండ్లు పూర్తయ్యాయని, ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘130రోజుల్లో వివిధ దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం.
భగవంతుడి దయవల్లే ఇదంతా సాధ్యమైంది. నేటితరం ఈ చిత్రాన్ని చూసి సనాతన ధర్మం ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు. గతకొన్నేళ్లుగా వరుసగా నాలుగు హిట్లు సాధించాను. ‘అఖండ-2’ విజయంపై పూర్తినమ్మకంతో ఉన్నాం’ అన్నారు. దేశం, దైవం, ధర్మం గురించి ఈ సినిమాలో చర్చించామని, భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రమిదని దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.