Sampath Nandi | తెలుగు సినిమాల్లో సంపత్ నంది ప్రత్యేకమైన దర్శకుడు. తీసేవి కమర్షియల్ సినిమాలే అయినా, ఆలోచనా విధానం మాత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. స్వతహాగా మంచి చదువరి కావడంతో.. ఆయన విషయ పరిజ్ఞానం అబ్బురపరుస్తుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడి సంస్కృతి,పండుగలను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నామని.. అదే ధోరణి సినిమాల్లోనూ కనిపిస్తున్నదని చెబుతున్నారు సంపత్ నంది.తెలంగాణ యాస వెండితెరపై సినిమా విజయానికి చిరునామాగా మారిందంటున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని దర్శకుడు సంపత్ నంది ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఒకప్పుడు తెలంగాణ యాసను హాస్యపాత్రలకు పెట్టి అవహేళన చేశారు. ఇప్పుడు అదే యాస పాన్ ఇండియా చిత్రాల్లో సక్సెస్ మంత్రంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడి సంస్కృతి, కళలను ప్రపంచం గుర్తిస్తుంది. ఆ ప్రాంతం తాలూకు కథల్ని తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది. ఇదొక సామాజిక సూత్రం. స్వరాష్ట్రంలో మన సంస్కృతిని, పండుగలను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాం.
ఈ క్రమంలోనే తెలంగాణ నేపథ్య కథలు వెండితెరను ఏలుతున్నాయి. సమకాలీన తెలంగాణ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు సమూలంగా మార్చేశారు. ఆయన తెలంగాణ ప్రజల ఆత్మ మాత్రమే కాదు.. మన జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన గొప్పవ్యక్తి. ఏదో అతిశయోక్తి కోసం నేనీ మాటలు చెప్పడం లేదు. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేస్తున్నా! పదేండ్ల క్రితం షూటింగ్ కోసం కోనసీమ ప్రాంతానికి వెళ్తే అక్కడి ప్రకృతి, పచ్చదనాన్ని చూసి మా ఊరు ఓదెల (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) ఇలా ఎందుకు లేదు? భూములన్నీ ఎందుకు బీడువారి కనిపిస్తున్నాయి? అని మథనపడేవాణ్ని. ఇప్పుడు మా ఊరికి వెళ్లి చూస్తే గోదావరి జిల్లాల కంటే గొప్పగా కనిపిస్తున్నది. కేసీఆర్‌గారి సంకల్ప బలం వల్లే నేడు తెలంగాణ సుభిక్షంగా తయారవుతున్నది.
కనుచూపు మేర పచ్చదనమే..
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నేను పెద్ద అభిమానిని. అందులో భాగంగా ఇప్పటివరకు మూడువేలకుపైగా మొక్కల్ని నాటించాను. ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం తెలంగాణ వ్యాప్తంగా పచ్చ తోరణాలు కట్టింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లి డ్రోన్ కెమెరా పెట్టి చూసినా.. కనుచూపు మేరా పచ్చదనమే కనిపిస్తున్నది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయులు పెరిగాయి. రాష్ర్టాన్ని పచ్చదనానికి కేరాఫ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి అలుపులేకుండా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణం నేపథ్యంలో స్వీయ నిర్మాణ సంస్థపై ‘సింబా’ అనే సినిమా చేస్తున్నా. ఈ చిత్రానికి ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ స్ఫూర్తి.
బతుకమ్మ.. సాంస్కృతిక విప్లవం
ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారు. మన పూలపండగ ఈ రోజు ట్యాంక్‌బండ్ మీద వేల వర్ణాలతో వెలిగిపోతున్నది. ఒకనాడు హైదారాబాద్‌లో బతుకమ్మ ఎక్కడో ఓ చోట కనిపించేది. ఇప్పుడు పదిరోజుల పాటు పెద్ద ఉత్సవంలా జరుగుతున్నది. ఇది కచ్చితంగా ఆమె సాధించిన సాంస్కృతిక విప్లవమే. మన మూలాలను కాపాడుకుంటూ ఎదగడమే నిజమైన అభివృద్ధి. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో తిరుగుతుంటే న్యూయార్క్ టైమ్ స్వేర్ దగ్గర ఉన్నామా! అన్న భావన కలుగుతుంది. అంతగా తెలంగాణ పురోగతి సాధించింది. మన సంస్కృతికి, యాసభాషలకు గడచిన పదేండ్లలో దేశవ్యాప్తంగా తిరుగులేని ప్రాచుర్యం దక్కింది. ఇప్పుడు తెలంగాణ అనే పదానికే కొత్త అందం వచ్చింది. సిరిసిల్ల, సిలికాన్ వ్యాలీ.. ఎక్కడైనా సరే కేటీఆర్ ప్రసంగాలు అద్భుతంగా అనిపిస్తాయి. ప్రజా సమస్యలపై ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయం. ఆయన్ని కష్టాలు తీర్చే రామా
రావుగా అభివర్ణించవచ్చు. సోషల్‌మీడియాలో ఏదైనా సమస్య గురించి చెబితే ఆయన టీమ్ వెంటనే స్పందిస్తుంది.
అగ్రహీరోలు కూడా మన యాసలో మాట్లాడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే పాపులర్ కల్చర్ సినిమాల్లో ప్రతిబింబిస్తుంటుంది. ఇన్నాళ్లు వివక్షకు గురైన మన యాసభాషలకు ఇప్పుడు సంపూర్ణ స్వేచ్ఛ లభించింది. దాంతో తెలంగాణ యాస సక్సెస్‌కు చిరునామాగా మారింది. ఔత్సాహిక తెలంగాణ యువత తాము చూసిన తెలంగాణ పల్లె జీవితాలను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా నాటకీయత లేకుండా సహజమైన తెలంగాణ కథల్ని ఆవిష్కరిస్తున్నారు.
మన యాస.. ‘పాన్ ఇండియా’
నేడు తెలుగు పరిశ్రమలో తెలంగాణ వారికి పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి. మన కథల్ని తెరకెక్కిస్తూ, మన యాసలో గర్వంగా మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ యాస మెయిన్‌స్ట్రీమ్ సినిమాలో ఓ భాగమైంది. ఉత్తరాదివారు కూడా మన యాస గురించి మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో మన వారికి మరింత విస్తృతమైన అవకాశాలు వస్తాయి. నా తదుపరి చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చేయబోతున్నా. ఓ అగ్రహీరో నటించే ఈ సినిమా కథాంశం తెలంగాణ నేపథ్యంలో ఉండబోతున్నది.
పవన్‌కళ్యాణ్, చిరంజీవిగారితో సినిమాలు చేయాలన్నది నా డ్రీమ్. వారికోసం కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో కొత్తవారిని ప్రోత్సహించే విషయంలో నేను ఎప్పుడూ ముందుంటాను. మా సంస్థ తీసిన నాలుగు చిత్రాల్లో చాలామంది కొత్తవారికి అవకాశమిచ్చాను. భవిష్యత్తులోనూ ఈ పంథా కొనసాగిస్తాను. నేను చదివే పుస్తకాలు, తీసే సినిమాలకు ఏమాత్రం సంబంధం ఉండదు. నా దృష్టిలో సినిమా అంటే సెలెబ్రేషన్. అక్కడ కష్టాలను ఏకరువు పెట్టడం నాకు నచ్చదు. ఇక పుస్తకాల విషయానికొస్తే లోతైన తాత్విక భావాలున్న రచనల్ని బాగా చదువుతాను. ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఎప్పటి కప్పుడు కొత్త కోణంలో ఆలోచించడానికి పుస్తక పఠనం తోడ్పతుందని నమ్ముతాను.
రైతుల ఆత్మబంధువు.. కేసీఆర్
నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. ఇరవైనాలుగు గంటల కరెంట్‌తో పాటు సంవత్సరం పొడవునా సాగునీరు, తాగునీరు లభిస్తున్నది. గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. రైతుబంధు దేశంలోనే గొప్ప పథకం. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ‘కళ్యాణలక్ష్మి’ ద్వారా కేసీఆర్‌గారు ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా మారారు. ‘రైతుబీమా’తో కర్షకులకు ఆత్మబంధువు అయ్యారు. మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రతీ పథకం ప్రజల కష్టాలను తీరుస్తూ భరోసా కల్పిస్తున్నది. విదేశాల్లో ఉన్న నా మిత్రులు కూడా.. ఎక్కడ చూసినా మన తెలంగాణ కళ, సంస్కృతి, విలువలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ‘ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ’ అని సగర్వంగా చెబుతున్నారు. తెలంగాణ కీర్తి ద్విగుణీకృతం కావాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు.
…? కళాధర్ రావు జూలపల్లి