నాగార్జున తన కెరీర్లో కీలకమైన మైలురాయికి చేరువయ్యారు. త్వరలోనే 100వ చిత్రం చేయబోతున్నారాయన. న్యూ టాలెంట్‌తో పనిచేసేందుకు ఉత్సాహం చూపించే నాగ్.. తమిళంలో ఒకే ఒక్క సినిమాను తెరకెక్కించిన రా.కార్తీక్‌కి తన 100వ చిత్రం బాధ్యతను అప్పగించారట. ఇదిలావుంటే.. మరోవైపు నాగ్ ఓ రీమేక్ చేయబోతున్నట్టు ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. తమిళంలో శశికుమార్ నటించిన ‘అయోతి’ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు నాగ్ ఆసక్తి చూపిస్తున్నారట. 2023లో విడుదలైన ఈ మెలోడ్రామాటిక్ సినిమాకు మంత్రి రామ్మూర్తి దర్శకుడు.
ఈ సినిమా కథ, కథనం, ఎమోషన్స్ గురించి తమిళ ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారనీ, తమిళనాట విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా ఘన విజయం సాధించిందనీ, అందుకే ఆ సినిమాను రీమేక్ చేసేందుకు నాగ్ ఉత్సాహం కనపరుస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే.. దర్శకుడిగా మంత్రి రామ్మూర్తే ఉంటారా? లేక వేరొకర్ని తీసుకుంటారా? అనేది తెలియాల్సివుంది. ఆగస్ట్ 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన 100వ సినిమాతోపాటు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది.