Naga Chaitanya | అక్కినేని కుటుంబంలో కొత్త అధ్యాయం మొదలైంది. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య జీవితంలోకి వచ్చిన శోభిత దూళిపాళ్ల ఇప్పుడు అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా తన స్థానాన్ని సంపాదించుకుంది. పెళ్లి జరిగిన నాటి నుంచి శోభిత పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. 2024 డిసెంబర్ 4న నాగ చైతన్య–శోభిత దూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట జరగడం విశేషంగా నిలిచింది. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించగా, ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
పెళ్లి తర్వాత నాగ చైతన్య కెరీర్ కూడా ఊపందుకుంది. శోభితతో వివాహానంతరం విడుదలైన ‘తండేల్’ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో ఇది చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో అక్కినేని ఇంటికి శోభిత అడుగుపెట్టిన తర్వాత చైతూకు లక్ కలిసి వచ్చిందన్న మాటలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఇదిలా ఉండగా పెళ్లి పూర్తై ఏడాది గడిచిన సందర్భంగా శోభిత తన ఆనందాన్ని వ్యక్తం చేయడం మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య–శోభిత ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి గురించి ఆసక్తికర కథనాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి అయిన వెంటనే ఈ జంట హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లో ఉన్న ఓ లగ్జరీ హౌజ్లోకి షిఫ్ట్ అయ్యారని సమాచారం. ఈ ఇంటి విలువ దాదాపు రూ.45 కోట్ల వరకు ఉంటుందని టాక్.
ఈ లగ్జరీ హౌజ్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా గ్రీనరీ ఉండటంతో పాటు, ఒకప్పటి గ్రామీణ వాతావరణాన్ని గుర్తు చేసేలా డిజైన్ చేశారని తెలుస్తోంది. అన్ని గదుల్లో సహజ వెలుతురు పడేలా ఇంటి నిర్మాణం చేయగా, విశాలమైన వరండాలు, హోమ్ థియేటర్, లైబ్రరీ, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలతో ఈ నివాసం మరింత ప్రత్యేకంగా మారింది. పెళ్లికి ముందే నాగ చైతన్య, శోభిత ఇద్దరూ కలిసి తమ అభిరుచులకు తగ్గట్టుగా ఈ ఇంటిని ప్లాన్ చేసుకున్నారని, ఇందులో నాగార్జున పెద్దగా జోక్యం చేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక నాగ చైతన్య ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో కలిసి ఓ భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ట్రెజర్ హంటర్ పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడని, ఆయన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రంగా నిలవనుంది.