చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ దూకుడు మామూలుగా లేదు. ఒకే టైమ్‌లో చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు తీయడమే కాక, రెండిటినీ సంక్రాంతి బరిలోకి దింపి.. తమతో తామే పొటీ పడ్డ క్రెడిట్ మైత్రీ వారిది. ఈ నెల 10న ఆ సంస్థనుంచి ‘జాట్’ సినిమా రానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నిర్మించిన ఈ హిందీ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.
ఇదిలావుంటే.. ఈ వేడిలోనే మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు మైత్రీవారు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ఇటీవలే హృతిక్‌కి బాబీ కథ కూడా వినిపించారట. దానికి హృతిక్ ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం హృతిక్ ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘క్రిష్ 4’ ఎలాగూ ఉంది. పైగా ఆ సినిమా ద్వారా హృతిక్ దర్శకుడిగా కూడా పరిచయం కానున్నారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో బాబీకి హృతిక్ ఛాన్సిస్తాడా?.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.