గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ చిత్రాలను నిర్మించి, కోలీవుడ్‌లోనూ అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించింది మైత్రీ మూవీమేకర్స్. ఈ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ తాజాగా తమిళంలో మరో చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ‘మైత్రీ తమిళ్ 3’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో తమిళనటుడు సూరి కథానాయకుడు. ఆర్.రవికుమార్ దర్శకుడు. మంగళవారం అనౌన్స్మెంట్ పోస్టర్ని విడుదల చేశారు. వరదనీటిలో సగం వరకూ మునిగి, వెనుక నుంచి కనిపిస్తున్న సూరిని ఈ పోస్టర్లో చూడొచ్చు.
అతని ప్రతిబింబం నీటిలో కనిపిస్తూ కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. హీరో చేతిలో కత్తి, అతని ముందున్న వాకిలిలో నుంచి వస్తున్న ఎర్రటి వెలుతురు, నీటిలో కనిపించే ప్రతిబింబంపై ‘BLOOD FOLLOWED THE FLOOD’ అనే వాక్యం కథలోని హింస, భావోద్వేగాలతో కూడిన ఓ ఇంటెన్స్ వాతావరణాన్ని సూచిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.