‘నటిగా నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి నిరంతరం తపిస్తుంటా. సినిమాలు పాత్రల పరంగా సవాళ్లు, వైవిధ్యతను ఇష్టపడతా. ప్రయోగాలు చేసేందుకు భయపడను. అవి ఫలించకపోయినా ప్రయత్నాల్ని ఆపను. అదే నా విజయ రహస్యం’ అని చెప్పింది కాజల్ అగర్వాల్. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోసగాళ్లు’. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. పెళ్లి తర్వాత విడుదలవుతోన్న ఆమె తొలి చిత్రమిది. ఈ సినిమా గురించి కాజల్ అగర్వాల్ చెప్పిన సంగతులివి…
నటిగా నాకు సరికొత్త అనుభూతిని పంచిన చిత్రమిది. సవాల్‌గా భావించి అను పాత్రను చేశా. రెగ్యులర్ కమర్షియల్ పంథాకు భిన్నగా నా క్యారెక్టర్ ఉంటుంది. ఓ అక్కాతమ్ముళ్లు ముంబాయిలోని బస్తీలో ఉంటూ అమెరికాలో పెద్దస్కామ్ ఎలా చేయగలిగారన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
కథ, నా పాత్రచిత్రణ నచ్చడంతో అక్కగా నటించడం ఇబ్బందిగా అనిపించలేదు. ఈ కథ గురించి విష్ణు నాకు చెప్పినప్పుడు సోదరుడిగా ఎవరూ నటిస్తున్నారని అడిగాను. నేనే ఆ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పాడు. మమ్మల్ని అక్కాతమ్ముళ్లుగా ప్రేక్షకులు స్వీకరిస్తారా అనే అనుమానం కలిగింది. కానీ దర్శకుడు మా పాత్రల్ని కన్వీన్సింగ్‌గా తెరపై ఆవిష్కరించారు.
విష్ణు చక్కటి నటుడు. సెట్స్‌లో ఉన్నప్పుడు ఆయనలో ఎప్పుడూ ప్రొడ్యూసర్ కనిపించడు. ఓ నటుడిగానే ఆలోచిస్తారు. ప్రొడక్షన్‌కు సంబంధించిన విషయాలేవీ షూటింగ్లలో మాట్లాడడు. నిర్మాతగా చక్కటి ప్లానింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా రియలిస్టిక్‌గా ఈసినిమా ఉంటుంది.
సినిమాల్లో అడుగుపెట్టి పద్నాలుగేళ్లు అవుతోంది. షూటింగ్‌ల కారణంగా ఇన్నేళ్లలో ఇంట్లో రెండు, మూడు రోజులకు మించి ఉండే అవకాశం రాలేదు. కానీ లాక్డౌన్ వల్ల ఏడాదిపాటు పూర్తిగా ఇంట్లోనే ఉన్నా. ఇన్నాళ్లు దూరమైన ఆనందాలన్ని ఈ విరామంతో పొందగలిగా. కుటుంబసభ్యులతో సంతోషంగా సమయాన్ని గడిపా. లాక్‌డౌన్‌లోనే పెళ్లిచేసుకున్నా. ఈ విరామాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నా.
ప్రస్తుతం పెళ్లికి ముందు అంగీకరించిన సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నా. అందుకే భర్త గౌతమ్‌తో ఎక్కువ సమయాన్ని ఆస్వాదించే అవకాశం దొరకడం లేదు. నా బిజీలైఫ్‌ను అర్థం చేసుకునే పరిణితి గౌతమ్‌లో ఉంది. షూటింగ్‌ల నుంచి విరామం దొరికిన గౌతమ్ ముందు వాలిపోతా. నేను ముంబాయి వెళ్లడం కుదరకపోతే వారాంతాల్లో గౌతమ్ నా దగ్గరకు వస్తుంటాడు.
నాలుగేళ్ల క్రితం ఈ వెబ్‌సిరీస్‌ను అంగీకరించా. సరైన సమయంలో విడుదలకాకపోవడం వల్లే సిరీస్‌కు సరైన ఆదరణ లభించలేదు. లాక్డౌన్ సమయంలో కొత్తదనంతో కూడిన కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. వాటితో పోలిస్తే కథలో నవ్యత కొరవడంతో ‘లైవ్‌టెలికాస్ట్ ’పరాజయానికి కారణమైంది. సాంకేతిక పరంగా అనుకున్న స్థాయిలో సిరీస్‌ను తెరకెక్కించలేకపోయారు. ఇది నాకో గొప్ప పాఠాన్ని నేర్పించింది. భవిష్యత్తులో వినూత్న ఇతివృత్తాలతో కూడిన వెబ్‌సిరీస్‌లు చేస్తా. ప్రస్తుతం కొన్ని అవకాశాలొస్తున్నాయి.
నటిగా నేను అనుకున్న లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదు. చేయాల్సిన పాత్రలు, సినిమాలు చాలా ఉన్నాయి. పూర్తిస్థాయి పౌరాణిక సినిమాలో నటించాలనుంది. స్వతహాగా లవ్‌స్టోరీస్, కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటివి మరిన్ని చేయాలి. కుటుంబ బాధ్యతల కారణంగా భవిష్యత్తులో సినిమాల ఎంపికలో కొంత సెలెక్టివ్‌గా ఉండాలనుకుంటున్నా.
గౌతమ్ ఉదయాన్నే నిద్రలేవడానికి బద్దకిస్తుంటాడు. కానీ నేను మాత్రం త్వరగా నిద్రలేస్తుంటా. మార్నింగ్ వర్కవుట్ చేయడానికి నేను రెండు నిమిష్లాలో రెడీ అవుతుంటా. గౌతమ్ మాత్రం నిదానంగా గంటకుపైగా సమయం తీసుకుంటుంటాడు.
ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’తో పాటు నాగార్జున-ప్రవీణ్ సత్తారు కలయికలో వస్తోన్న సినిమాలో నటిస్తున్నా. ఈ నెలాఖరున నాగార్జున సినిమాలో భాగం కాబోతున్నా. తమిళంలో రెండు చిత్రాల్ని అంగీకరించా.
‘ఆచార్య’కు ముందు నా సినిమా షూటింగ్‌లకు గౌతమ్ ఎప్పుడూ రాలేదు. చిత్రీకరణల్లో వాతావరణం ఎలా ఉంటుంది?సినిమాను ఎలా తీస్తారనేది తనకు పెద్దగా అవగాహన లేదు. సినిమా రూపకల్పనలో తీసుకునే జాగ్రత్తల్ని చూసి చాలా ఎైగ్జెటింగ్గా ఫీలయ్యాడు. గౌతమ్‌ను ఆహ్వానించాలనే ఆలోచన చిరంజీవి గారిదే. ఆయన మాకు ఆహ్వానం పంపి సర్ప్రైజ్ చేశారు.
నేను చేసే సినిమాల పట్ల గౌతమ్‌లో సంతోషం, గర్వం కనిపిస్తుంది. గౌతమ్‌లో కథల కంటే ఓ సినిమాను ఎలా తెరకెక్కిస్తారు? ఎంత వసూళ్లు చేస్తోందనేది తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తుంది. నేను మాత్రం ఆ లెక్కలేవీ పట్టించుకోను. నా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా?లేదా?అన్నదే చూస్తా. గౌతమ్ మాత్రం నాకు భిన్నంగా ఆలోచిస్తాడు.
నాది సినిమాటిక్ లవ్‌స్టోరీ. గౌతమ్‌తో పదేళ్లుగా పరిచయం ఉంది. అయితే మా స్నేహం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఎప్పుడూ అనుకోలేదు. లాక్డౌన్ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడే మా బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. గౌతమ్‌తో పెళ్లి గురించి మొదట నేనే మా అమ్మనాన్నలకు చెప్పా. వారిని ఒప్పించిన తర్వాతే గౌతమ్ మా కుటుంబసభ్యులతో మాట్లాడాడు. అయితే మా మధ్య ఉన్న ప్రేమ గురించి అమ్మనాన్నలకు చూచాయగా తెలుసు. అమ్మతో మొదట గౌతమ్‌ను ప్రేమిస్తున్న సంగతి చెప్పా. ఆ తర్వాత అమ్మ, నేను కలిసి నాన్నను ఒప్పించాం.
పెళ్లి తర్వాత మహిళలందరిపై గౌరవం పెరిగింది. కమిట్మెంట్, ప్లానింగ్‌తో మల్టీటాస్కింగ్ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించడం సులభం కాదు. షూటింగ్లలో ఉంటూ ఇంటి అవసరాల్ని, భర్త యోగక్షేమాల్ని తెలుసుకుంటూ నా బాధ్యతల్ని నిర్వరిస్తున్నా.