‘కథ అందరూ బావుందన్నారు. కానీ కొందరు మాత్రం కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందా? అనే సందేహం వ్యక్తం చేశారు. అయితే.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ నాలో నమ్మాకాన్ని నింపారు. ‘అన్ని వర్గాలకూ నచ్చుతుంది.. ధైర్యంగా తీయ్’ అని వెన్ను తట్టారు. సినిమా విడుదలయ్యాక ఒక్క నెగెటివ్ కామెంట్ లేదు.’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన చిత్రం ‘లక్కీభాస్కర్’.
సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్నదని గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వెంకీ అట్లూరి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఏ సినిమాకైనా హీరోనే మెయిన్ పిల్లర్ అని నేను నమ్ముతాను. దుల్కర్ ఈ సినిమా ప్రారంభం నుంచీ ఇచ్చిన సహకారం జీవితంలో మరిచిపోలేను.
సింగిల్ సిట్టింగ్‌లో కథ ఓకే చేశారాయన. అందరికంటే ముందు లొకేషన్లో ఉండేవారు. ఆయన ఫుల్ ఎనర్జీతో ఉండటం వల్ల, సెట్ అంతా సంతోషంగా ఉండేది. నిర్మాత నాగవంశీ ఈ కథను బాగా నమ్మారు. నేను అడక్కపోయినా.. కథకు తగ్గ భారీతనాన్ని తీసుకురావడంకోసం సెట్లను నిర్మించారు. రాజీ పడని ఆయన నిర్మాణ విలువలే సినిమాకు భారీ తనాన్ని తెచ్చాయి.’ అని వెంకీ అట్లూరి చెప్పారు. రాంకీ, సర్వదమన్ బెనర్జీ లాంటి సీనియర్ నటులు నటించడం సినిమాకు కొత్త అందాన్నిచ్చిందనీ, సాంకేతికంగా కూడా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారనీ, వందకోట్ల వసూళ్లకు ‘లక్కీభాస్కర్’ చేరువ అవతున్నందుకు గర్వంగా ఉందని వెంకీ అట్లూరి ఆనందం వెలిబుచ్చారు.