గత ఏడాది ‘డర్టీ హరి’ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టు కున్న దర్శకనిర్మాత ఎం.ఎస్.రాజు మరో విభిన్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని చెప్పారు. ‘జూన్ 7న షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్లలో షూటింగ్ చేయబోతున్నాం. నటీనటుల వివరాల్ని ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నాం’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.