ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 19:42:14

గంగవ్వకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే ‘సుంకె’

గంగవ్వకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే ‘సుంకె’

కరీంనగర్‌ : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌-4 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. వ్యాఖ్యాత టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున షోలో పాల్గొననున్న కంటెస్టెంట్‌లను ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ.. అందరినీ బిగ్‌బాగ్‌ హౌస్‌లోకి పంపాడు. ఈ సారి సీజన్‌లో అందరి కళ్లు ఒకే ఒక్కరిపై ఉన్నాయి. ఆమె ‘మై విలేజ్‌ షో’ ఫేమ్‌.. యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ. ప్రస్తుతం గంగవ్వ పేరిట ట్వీట్లు హోరెత్తుతుండగా.. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. పలువురు తాము బిగ్‌బాస్‌ చూడమని, గంగవ్వ కోసం చూస్తామని ట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గంగవ్వకు మద్దతుగా నిలిచారు. ‘మా చొప్పదండి నియోజకవర్గ అవ్వ గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. మారుమూల పల్లె నుంచి తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. గంగవ్వ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మరో వైపు సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్‌ మా ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో నామినేషన్‌ ప్రక్రియలో గంగవ్వ చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు కంటెస్టెంట్లు ఒక విండో వద్ద నిలబడి ఉండగా.. ఒకరి పేరు చెప్పి.. కిటికీని మూసి ఎలిమినేషన్‌ కోసం నామినేట్‌ చేయాల్సి ఉంది. గంగవ్వ వంతు రాగా.. ‘ఎవలు ఎందుకు.. మొన్ననే వచ్చిన్రు వాళ్లిద్దరు గూడ’ అంటూ చెప్పిన డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.logo