Miss World 2025 | హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే విజేత ఎవరో తెలనుంది. మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ కోసంహైదరాబాద్ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫైనల్ నిర్వహణకు సర్వం సిద్ధం అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6-30గంటలకు కార్యక్రమం ప్రారంభమై 9-20గంటలకు ముగియనుందని తెలుస్తుంది.. దాదాపు 3500 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతూ.. ఈ మెగా ఈవెంట్‌కు వేదిక సిద్ధంగా ఉంది. అయితే ఫైనల్స్‌లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
ఈ గ్రాండ్ ఫినాలే 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుండగా,ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ సారి మిస్‌వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలి రాగా, వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుంచి ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం అందుకోనున్నారు. మిస్ వరల్డ్ ఛైర్పర్సన్ జూలియా మోర్లే ఈ ప్రతిష్టాత్మక జ్యూరీకి నేతృత్వం వహిస్తుండగా, జ్యూరీ సభ్యులుగా.. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ప్రముఖ ఆంత్రప్రెన్యూర్ సుధా రెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరినా టిర్రెల్ వ్యవహరించనున్నారు. వీరులో సోనూ సూద్ మిస్‌వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందజేయనున్నారు.
మరోవైపు ఈ వేదిక మీద బాలీవుడ్ స్టార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. మానుషి చిల్లర్ (2017 మిస్ వరల్డ్), స్టెఫానీ డెల్ (2016 మిస్ వరల్డ్) ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. ప్రెజెంటర్‌గా సచిన్ కుంభార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా, కంటెస్టెంట్లకు మే 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే పోటీ నిర్వహించారు. అలానే మే 25న జ్యుయలరీ / పెర్ల్ ఫ్యాషన్ షో, మే 26న “బ్యూటీ విత్ ఎ పర్పస్”,గాలా నైట్ , గాలా డిన్నర్ (బ్రిటిష్ రెసిడెన్సీ/తాజ్ ఫలక్‌నుమాలో) నిర్వహించారు.