హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ అభివృద్ధికి సహకరిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీ పరిశ్రమలోని పెద్దల సహకారంతో బ్రహ్మాండమైన ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఇక్కడ బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందని చెప్పారు. చిత్రపురి కాలనీలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం, డూప్లెక్స్ ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి కృషితో ప్రభుత్వం ఇక్కడ స్థలం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. యూసుఫ్‌గూడ, రహ్మత్ నగర్, బొరబండ తదితర ప్రాంతాలలో సినీ కార్మికులు నివసిస్తున్నారని చెప్పారు.
మొదటి విడతలో 2632 ఇండ్లను అర్హులకు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు 1176 డబుల్ బెడ్రూం ఇండ్లు, 180 డూప్లెక్స్ ఇండ్లను లబ్దిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. చిత్రపురి కాలనీలో రూ. 20 కోట్ల వ్యయంతో రోడ్లను నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కాలనీ వాసుల సౌకర్యార్ధం రేషన్ షాప్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా నీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మిగిలిన కార్మికులకు కూడా ఇండ్లు నిర్మించి ఇచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి స్థలం కేటాయించే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
సినీ పరిశ్రమలో అర్హులైన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ అధ్యక్ష కార్యదర్శులు అనిల్, దొరై, లలితా, రామకృష్ణ, వెంకట్ యాదవ్, రఘు, దీప్తి వాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.