హైదరాబాద్ : తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన గొప్ప నటుడు చలపతిరావు అని, అలాంటి వ్యక్తి మృతి చాలా బాధాకరమని సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీనియర్ తెలుగు సినీ నటుడు చలపతిరావు హఠాన్మరణం వార్తను తెలుసుకున్న మంత్రి తలసాని ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పార్థీవదేహం వద్ద నివాళుర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మూడు తరాలకు చెందిన నటులతో సుమారు 1250కిపైగా చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు చలపతిరావు అన్నారు. పరిశ్రమలోని అందరితో ఎంతో కలివిడిగా ఉండే వ్యక్తి మన మధ్యలో లేడనే వార్త ఎంతో కలచి వేస్తుందని పేర్కొన్నారు.
ఒక సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించి రెండు రోజులు గడవకుండానే మరో నటుడు చలపతిరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చలపతిరావు కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంత్రితో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చలపతిరావు పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు.