చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకుడు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని ‘ఆకాశం అందనీ..’ అనే పాటను మంత్రి సీతక్క విడుదల చేశారు. చైతన్య పింగిళి సాహిత్యం అందించిన ఈ పాటను నరేష్ అయ్యర్, నయన నాయర్ ఆలపించారు.
అరుణ్ చిలువేరు స్వరకర్త. కరీంనగర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సార్వజనీన భావోద్వేగాలుంటాయని, ఈ పాట ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. మధ్య తరగతి జీవితాల్లోని కథలు, వ్యథలను ఆవిష్కరించే చిత్రమిదని దర్శకుడు కుమారస్వామి పేర్కొన్నారు.
కమర్షియల్ అంశాలు కలబోసిన రియలిస్టిక్ మూవీ ఇదని, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని హీరో చైతన్య రావు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి, సంభాషణలు: పెద్దింటి అశోక్ కుమార్, నిర్మాతలు: శ్రీలత, నాగార్జున, సామల శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, కృష్ణకాంత్ చిత్తజల్లు, రచన-దర్శకత్వం: కుమారస్వామి (అక్షర).