మంత్రి కొండా సురేఖను ముందుపెట్టి సీఎం రేవంత్ ఆడిన డైవర్షన్ గేమ్ బూమరాంగ్ అయింది. పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రేవంత్ అండ్ కంపెనీ రచించిన వికృత రాజకీయ నాటకం బెడిసికొట్టింది. నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన అమానవీయ వ్యాఖ్యలపై తెలుగు సినీ ఇండస్ట్రీ భగ్గుమంది.
చిన్నాపెద్దా నటులు అనే తేడా లేకుండా యావత్ సినీరంగం ఒక్కతాటిపై నిలిచి ముక్తకంఠంతో నిరసన స్వరం వినిపించారు. చిల్లర డ్రామాలు ఆపి ఇక పరిపాలనపై దృష్టిపెట్టండంటూ రేవంత్ సర్కార్‌కు సోషల్‌మీడియా వేదికగా తలంటారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. filmindustrywillnottolerate అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. తాజా పరిణామాలు సినీరంగంలోని ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానించాయి.
‘గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ మహిళా మంత్రి చేసిన అమానవీయ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. త్వరితగతిన తాము ఆశించిన లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేయడం సిగ్గుచేటు. మా సభ్యులపై చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను ఖండించే విషయంలో సినీ కుటుంబం ఏకతాటిపై నిలుస్తుంది. రాజకీయ విషక్రీడలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతటి నీచస్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ మనం నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి మాటలతో వారు తమ స్థాయిని తగ్గించుకోవద్దు. ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు, వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఇలాంటి హేయమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నా’
– చిరంజీవి
రాజకీయలబ్ది కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం నన్ను ఎంతగానో బాధించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు తమ స్వప్రయోజనాల కోసం మహిళను ఆయుధంగా వాడుకోవడం దురదృష్టకరం. సినిమా వాళ్లు పరస్పర గౌరవం, అంకితభావంతో పనిచేస్తారు. తమ వ్యక్తిగత జీవితానికి ఎంతో విలువిస్తారు. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వారు నైతిక విలువలు కలిగి ఉండాలి. రాజకీయ స్వార్థం కోసం వ్యక్తుల జీవితాలను టార్గెట్ చేయడం ఆమోదయోగ్యం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మాట్లాడేముందు వాటి తాలూకు పర్యవసానాలను బేరిజు వేసుకోవాలి. సంయమనంతో వ్యవహరించాలి.
– వెంకటేష్.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా.. ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఇతరుల మనోభావాలను గాయపర్చనంత వరకు మనందరం వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. కానీ ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని దురుద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. మహిళలందరినీ గౌరవంగా చూడటం మన కర్తవ్యం కావాలి.
– మహేష్‌బాబు
సినీ తారలు, కుటుంబాలపై చేసిన నిరాధారమైన, హేయమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఓ మహిళ విలువలు మరిచి ఇలా మాట్లాడటం తెలుగు సంస్కృతికి విరుద్ధం. బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ఉపేక్షించవద్దు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, ముఖ్యంగా మహిళల పట్ల దయాభావంతో ఉండాలని రాజకీయ పార్టీలను కోరుతున్నా. సమాజంలో విలువలు ప్రోదికోల్పేలా మనందరం ప్రయత్నం చేద్దాం.
– అల్లు అర్జున్
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అద్భుతమైన సృజనాత్మకత, వృత్తిపట్ల నిబద్ధతకు పెట్టింది పేరు. ఇక్కడ నేను అందమైన ప్రయాణాన్ని సాగించాను. ఇప్పటికీ పరిశ్రమతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నా. అలాంటి గొప్ప ఇండస్ట్రీలో ఒక మహిళ గురించి నిరాధారమైన, దుర్మార్గమైన ఆరోపణలు చేయడం కలచివేసింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. హుందాగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో మేమంతా ఇన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నాం. దానినే మా బలహీనతగా భావిస్తున్నారు. నేను రాజకీయాలకు పూర్తిగా అతీతంగా ఉంటాను. ఏ పార్టీతో సంబంధాలు లేవు. రాజకీయ మైలేజీ కోసం నా పేరును ఉపయోగించవద్దని కోరుతున్నా. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తులను రాజకీయ వికృత క్రీడలో భాగం చేయొద్దు. సంచలనాల కోసం వారి పేర్లను వాడుకుంటూ కల్పిత కథనాలను సృష్టించవద్దు.
– రకుల్‌ప్రీత్‌సింగ్.
ఇది దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. బాధ్యతా రాహిత్యంగా నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. మీలాంటి కీలక వ్యక్తులు, ఎదుటివారిపై గౌరవంగా వ్యవహరించాలి. అభిప్రాయ వ్యక్తీకరణలో నియంత్రణ, గోప్యత పాటించాలి. వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చడం మీలాంటి వాళ్లకు తగదు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను ఎవరూ హర్షించరు. ఇకపై ఇలాంటి వాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. పరిధులు దాటి ప్రవర్తించకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– జూనియర్ ఎన్టీఆర్
సినిమావారి కుటుంబాలపై ఇలా నిరాధరమైన వదంతులు సృష్టించి మాట్లాడితే సహించేది లేదు. మంత్రి కొండా సురేఖ ఇలా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.
– డా.రాజశేఖర్
కొండా సురేఖ సమంతకు క్షమాపణ చెప్పడం ఏమిటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగచైతన్యని..ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఆస్తిని కాపాడుకోవటానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే తాను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్న ఘోరమైన ఇన్సల్ట్ను నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఈ విషయాన్ని నాగార్జునగారు చాలా సీరియస్‌గా తీసుకొని మరిచిపోలేని గుణపాఠం చెప్పాలి. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగచైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంతలాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మంచి నటి మీద అంత నీచమైన మాటలను అనడాన్ని అందరూ తీవ్రంగా ఖండించాలి.
– రామ్‌గోపాల్‌వర్మ
ప్రతి ఒక్కరి హద్దులను మనం గౌరవించాలి. పరస్పరం హూందాగా వ్యవహరించాలి. నిరాధారమైన ఆరోపణల్ని ఏమాత్రం భరించవద్దు. ముఖ్యంగా అధికారిక స్థానాల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి.
– రాజమౌళి
‘మా అమ్మ మాట్లాడిన ప్రతీ మాటను నేను సమర్థిస్తున్నా. నేను నా కుటుంబం పక్షాన నిలబడి పోరాడతాను. ఇలాంటి పైశాచిక వ్యాఖ్యల గురించి మాట్లాడటం నిజంగా బాధగా అనిపిస్తున్నది. కానీ కొన్నిసార్లు ఇలాంటి సైకోపాత్‌లను ఎదుర్కొనక తప్పదు.
– అఖిల్ అక్కినేని
కట్టుకథలు అల్లి, ఓ రకమైన పైశాచికత్వంతో ఇండస్ట్రీలోని గౌరవప్రదమైన వ్యక్తులు, కుటుంబంపై మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయ క్రీడలో ఇండస్ట్రీ వారిని లాగడం నిజంగా సిగ్గుచేటు. అమాయకులైన వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను రాజకీయాల కోసం వాడుకోవద్దు. నేతలు సమాజానికి మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఆదర్శంగా నిలవాలి.
– రవితేజ
కొండా సురేఖగారూ.. స్త్రీగా మీకు కొన్ని విలువలు ఉన్నాయని అనుకుంటున్నా.. అవన్నీ ఎక్కడికి పోయాయి? ఇలాంటి ఆరోపణలు చేసినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మన దేశంలో ప్రజాస్వామ్యం వన్ వే ట్రాఫిక్ కాదు. మాకు సంస్కారం ఉంది. మేం మీలా దిగజారి మాట్లాడలేం. కనీస విలువ లేనివారు రెండు నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడతారు. బాధ్యతగల పదవిలో ఉండి, చిత్రపరిశ్రమలోని వారిని ఇలా కించపరుస్తూ.. నిరాధారమైన, భయంకరమైన ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం.
-నటి ఖుష్బూ
ఏదైనా అవసరం పడినప్పుడు సినిమా వాళ్లంతా తమకు మద్దతుగా రావాలని రాజకీయ నాయకులు కోరతారు తమకు ఏదైనా లబ్ది జరగాలనుకుంటే మాత్రం ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము అద్దాల మేడల్లో ఉంటున్నాం కాబట్టి ఏం చేసినా మౌనంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓ మహిళ మంత్రి ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపించింది. ప్రజలకు గొప్ప వినోదాన్ని అందిస్తున్న తారలపై గౌరవాన్ని ప్రదర్శించండి. మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు.
– మంచు లక్ష్మీ
ఇతరుల వృత్తుల మాదిరిగానే మా వృత్తినీ గౌరవించండి. క్లిక్స్ కోసం ఇష్టం వచ్చిన థంబ్‌నెయిల్స్ పెట్టి వీడియోలు పోస్ట్ చేయొద్దు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలకోసం సినీ, టీవీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై అసత్య ఆరోపణలు చేయడం తగదు. ఈ విషయంపై మేమంతా ఒకే కుటుంబంగా నిరసన తెలియజేస్తున్నాం.
– యాంకర్ సుమ కనకాల
మీకు ఓటు వేసి గెలిపించింది రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారని, ప్రగతిపథంలో నడిపిస్తారని, ప్రజాశ్రేయస్సుకోసం శ్రమిస్తారని. ఇలా దిగజారుడు వాఖ్యలు చేయమని కాదు. ఈ తాజా పరిణామంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. ఇలాంటివి మరోసారి రిపీటైతే బాధ్యత గల పౌరులుగా సహించం. అనుమతించం.. అంగీకరించం.
– హీరో దేవరకొండ విజయ్
మంత్రి కొండా సురేఖగారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితమైనవి, నిరాధారమైనవి. బాధ్యతగల రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా అసభ్యకరమైన అపవాదులు వేయడం సమాజపు మూలాలను నాశనం చేయడమే. సినీకళాకారులుగా మేమందరం కలిసే ఉన్నాం. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన మరోసారి పునరావృతం అయితే సహించం. ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి.
– రామ్‌చరణ్
తెలంగాణకు చెందిన మహిళా మంత్రి .. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల పట్ల బాధతో.. రెండు తెలుగు రాష్ర్టాలకూ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘గత కొన్నేళ్లుగా చాలామందికి తెలుగు సినీ సెలబ్రిటీలు సులువైన టార్గెట్‌గా మారారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభావవంతమైన వ్యక్తులు, అధికారంలో ఉన్న వ్యక్తులు వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. రాజకీయాలు, సినిమాలు సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపే శక్తిమంతమైన సాధకాలు. ఈ రెండు రంగాల వారు పరస్పర సహకారంతో, గౌరవంతో బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించడం అవసరం.
రాజకీయ సమస్యలు తలెత్తినప్పుడు ప్రజల దృష్టిని మరల్చడంకోసం సినిమావాళ్ల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇలాంటి హేయమైన చర్యలను మానుకోవాలని అందర్నీ కోరుతున్నాం. ఇతరుల దృష్టిని ఆకర్ష్షించడం కోసం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేస్తున్న దుర్మార్గమైన, హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని మేం తెలియజేస్తున్నాం. సినిమావాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపడిన సున్నితమైన విషయాలపై ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే, వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని మరోమారు హెచ్చరిస్తున్నాం.
– తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (TFCC), కార్యదర్శి కె.ఎల్.దామోదరప్రసాద్
ఇతర పరిశ్రమల మాదిరిగానే సినీ పరిశ్రమ కూడా నమ్మకం, గౌరవంతో నడుస్తున్నది. మీ రాజకీయ స్వలాభం కోసం మా జీవితాలపై అబద్ధాలను వండివార్చడం బాధగా ఉంది. నటులుగా మేం అందరివాళ్లం. కానీ మా కుటుంబం మాత్రం మా వ్యక్తిగతం. పరువుతో బతుకుతున్నాం. అన్ని కుటుంబాల్లాగే మాకూ గౌరవం, రక్షణ అవసరం. రాజకీయనాయకులకు మేం మనవి చేస్తున్నది ఒక్కటే. ప్రజలకు వినోదాన్ని పంచేందుకు మేం ఎంతో కష్టపడుతుంటాం. కళారంగంలో నిరంతరం శ్రమిస్తుంటాం. మీ రాజకీయ ప్రయోజనాలకోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం మా పేర్లు, మా కుటుంబాల పేర్లు వాడొద్దు. మా జీవితాలను చర్చనీయాంశాలు చేసి, మా మనశ్శాంతిని పోగొట్టొద్దు. కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాలు తీవ్రమైన మనోవేదనకు గురిచేస్తాయి. అవి కెరీర్‌పై కూడా ప్రభావం చూపిస్తాయి. ఇకపై ఇలాంటి దాడులు సహించం. మేమంతా ఏకమై నిలబడతాం.
– మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు
రాజకీయ లబ్ధి కోసం సినీతారల వ్యక్తిగత జీవితాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. మంత్రి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. ఏ రంగంలోనైనా స్త్రీ ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఎంత కష్టమో ఓ మహిళగా మీకు తెలుసు. కానీ అలా ఎలా మాట్లాడారు? తన పార్టీలోని వారు తప్పుడు మాటలకు దూరంగా ఉండేలా రాహుల్‌గాంధీ చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారు కూడా ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. సురేఖ వ్యక్తిగత దూషణలను చిత్ర పరిశ్రమ ముక్తకంఠంతో ఖండిస్తున్నది.
-నటుడు మంచు మనోజ్
సినీ నటులు కూడా మనుషులే అనే విషయం గుర్తుంచుకోవాలి. వాళ్లకూ అన్ని రకాల భావోద్వేగాలుంటాయి. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలపై కట్టుకథలను సృష్టించవద్దు. మీరు ఎవరిమీదైతే ఆరోపణలు చేశారో తానొక సూపర్‌స్టార్. ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంది. ఒక మాట అనే ముందు దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఒకర్ని మనం నవ్వించకున్నా ఫర్వాలేదు కానీ వారి కన్నీళ్లకు కారణం కాకూడదు
– విశ్వక్సేన్
కొండా సురేఖగారు ఓ ప్రముఖ సినీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వల్ల రాజకీయంగా ఆమెకు ఎంతమేర లబ్ది చేకూరిందో తెలీదుకానీ.. ఓ స్త్రీ ఆత్మాభిమానానికి, ఆ కుటుంబం పరువు, ప్రతిష్టలకు మాత్రం తీవ్రమైన నష్టం వాటిల్లిన మాట నిజం. మీ రాజకీయ అవసరాలకోసం తెరమీదే తప్ప జీవితంలో నటించడం తెలీని సున్నిత మనస్కులైన కళాకారులను బలి చేయొద్దు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు పడతారని ఆశిస్తున్నా.
– హీరో సాయిదుర్గతేజ్
రాజకీయ లబ్ధ్ది కోసం సినిమా తారలను పావులుగా వాడుకోవడం నిజంగా దురదృష్టకరం. మీలో ఫ్రస్టేషన్ ఎంతలా ఉందో ఆ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. మీ చిల్లర మాటలకు ఇండస్ట్రీ ఏమాత్రం భయపడదు. తెలంగాణకు పేరు తెచ్చిన సినిమా ఇండస్ట్రీని నీ మాటలతో అవమానపరిచావు. ఇలాంటి గాసిప్లను క్రియేట్ చేయడం పక్కనబెట్టి పరిపాలనపై దృష్టి పెట్టండి. ఇప్పటికే మీ విలువ పడిపోయింది. దానిని మరింత దిగజార్చుకోవద్దు.
– సుధీర్‌బాబు.
కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఓ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మహిళలను కించపరిచే ధోరణి ఏమాత్రం సమంజసం కాదు. ఈ రకమైన దుర్మార్గమైన ధోరణుల్ని సినిమా ఇండస్ట్రీ ఏ మాత్రం ఉపేక్షించదు. రాజకీయ కక్షసాధింపుల కోసం సినిమా వాళ్లను లక్ష్యంగా ఎంచుకోవద్దు. ఇలాంటి నాన్సెన్స్ను పక్కనబెట్టి ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
– వరుణ్‌తేజ్
ఓ సినీ కుటుంబం మీద అంతటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదు. వాళ్లు ఈ మధ్యే సమస్యలను అధిగమించి కాస్త కుదుటపడుతున్నారు. అన్నింటికంటే సిగ్గు చేటైన విషయం ఏమిటంటే..ఓ మహిళ అయిఉండి మరో మహిళ మీద హేయమైన వ్యాఖ్యలు చేయడం. నటులు, వారి కుటుంబ సభ్యులు ఇలా సాఫ్ట్ టార్గెట్‌గా మారడం బాధిస్తోంది. ఇలాంటి పుకార్లకు స్వస్తి పలికి ప్రజలకు మేలు చేయడంపై దృష్టిపెట్టండి
– లావణ్య త్రిపాఠి
దయచేసి కాస్త ఆలోచించి మాట్లాడండి. వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం నిజంగా అమర్యాదకరం. బాధ్యతగల పదవిలో ఉండి ఇలా మాట్లాడటం తగదు. అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకోం. ఇలాంటి దూషణలను ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాం.
– నటుడు కిరణ్ అబ్బవరం
నటీనటులపై మీకు ఇంత చులకన భావం ఉండటం నిజంగా బాధాకరం. కేవలం మూడు లక్షల మంది ఓట్లు వేస్తే మీరు ప్రజాప్రతినిధలయ్యారు. కానీ ఒక నటుడిగా ఎదగాలంటే వంద మిలియన్ల మంది నమ్మకాన్ని సంపాదించాలి. ముఖ్యంగా మీ కామెంట్స్‌లో స్త్రీలను కించపరచడం నిజంగా ఆమోదయోగ్యం కాదు. ఓ వైపు ప్రజలకు వినోదాన్ని అందిస్తూ, మరోవైపు సామాజిక సేవలో కూడా ముందు వరుసలో ఉంటూ, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ సినిమావాళ్లనే కొందరు టార్గెట్ చేస్తున్నారు. మీ రాజకీయ లబ్దికోసం మా వ్యక్తిగత జీవితాలను హరిస్తామంటే ఊరుకోం. మా జీవితాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నా.
-నటుడు తేజా సజ్జ
మీ రాజకీయ ప్రయోజనాలకోసం సినిమా వాళ్లను టార్గెట్ చేయడం తగదు. అక్కినేని కుటుంబంపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ ముందుండే సినిమా వాళ్లను ఇలా చులకన చేసి మాట్లాడటం చాలా తప్పు. సురేఖగారూ దీన్ని మీరే మొదలుపెట్టారు. సంస్కారవంతంగా దీన్ని ముగించాల్సింది కూడా మీరే.
-దర్శకుడు హరీశ్‌శంకర్
అధికార స్థానాల్లో ఉన్నవారి నోటి నుంచి ఇలాంటి అసభ్యమైన మాటలు రావడం బాధాకరం. ఎలాంటి అధారాలు లేకుండా విచక్షణ మరచి సెలబ్రిటీల మీద వ్యాఖ్యలు చేయడం సరికాదు. అన్ని రకాలుగా హద్దులు మీరి వారి ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దు. సినీ తారల గౌరవాన్ని కాపాడటానికి మనమంతా ముందుకురావాలి
– నితిన్
స్పూర్తిగా నిలిచిన ప్రముఖుల గురించి ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులే బహిరంగ వేదికపై ఇలా అవమానకరమైన ఆరోపణలు చేయడం నిజంగా బాధాకరం. దయచేసి చిత్రపరిశ్రమను, మా మనోభావాలను గౌరవించండి.
– సందీప్ కిషన్