MeToo | కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. హేమా కమిటీ నివేదికపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలకమైన వాస్తవాలను దాచిపెట్టి.. ప్రముఖులకు రక్షణ కల్పిస్తోందని ఆరోపించాయి. కమిటీ నివేదిక ఈ నెల 19న విడుదలైన విషయం తెలిసిందే. కేరళ సీఎం పినరయి విజయన్‌కు సమర్పించిన ఐదేళ్ల తర్వాత నివేదిక విడుదలవగా.. దోపిడీ, లైంగిక వేధింపులు, అధికార దుర్వినియోగం, పలు చీకటి కోణాలను కమిటీ వెల్లడించింది. కమిటీ నివేదిక వెలువడిన నుంచి పలువురు నటీమణులు నటులు, దర్శకులు వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపించారు.
కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ మాట్లాడుతూ కమిటీ నివేదిక విషయంలో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందని ఆరోపించారు. ప్రభుత్వం దాడుగుమూతలు ఆడుతూ కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలతో సినీ పరిశ్రమలో అందరూ ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందన్నారు. పరిశ్రమలో చాలామంది వ్యక్తులు ఉన్నారని.. ప్రభుత్వం అసలు దోషులను దాస్తోందని ఆరోపించారు. అందుకే అమాయకులు సైతం అవమానపడాల్సి వస్తుందని.. ఈ సమస్యను పరిష్కరించాలని సతీషన్ మలప్పురంలో విలేకరులతో మాట్లాడుతూ కమిటీ నివేదికపై ప్రభుత్వం మౌనం వహిస్తుందని, ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. లైంగిక నేరాలను దాచిపెట్టడం కూడా నేరమని చట్టం చెబుతున్నా.. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు.
హేమా కమిటీ నివేదికలోని పేజీలను, పేరాలను సమాచార హక్కు చట్టం కింద తొలగించి ప్రభుత్వం ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.. హేమా కమిటీ నివేదికలో పేర్కొన్న సినీ పరిశ్రమలో డ్రగ్స్ విస్తృతంగా వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటూ నిలదీశారు. మహిళల పట్ల ప్రభుత్వం ఎందుకు ఈ వైఖరి అవలంబిస్తోంది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పి.. నిర్ణయాలు తీసుకుంటే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పని ప్రదేశంలో ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.