Meera Mithun | కోలీవుడ్‌లో తరచూ వివాదాలకు కేంద్రబిందువైన నటి మీరా మిథున్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మూడేళ్లుగా పరారీలో ఉన్న ఆమెపై చెన్నై కోర్టు తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే అరెస్ట్ చేసి ఈ నెల 11వ తేదీన కోర్టులో హాజరు పరచాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా నటి మీరా మిథున్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా పరారీలో ఉన్న ఆమెను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఉన్న మీరా మిథున్‌ను రక్షించి అప్పగించాలంటూ ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది
దాంతో చెన్నై లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఢిల్లీలో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇచ్చి, ఢిల్లీ పోలీసుల సాయంతో ఆమెను గుర్తించి అక్కడున్న ప్రభుత్వ హోంలో ఉంచినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా, 2021 ఆగస్టులో మీరా మిథున్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో తీవ్ర దుమారాన్ని రేపింది. అందులో ఆమె ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులపై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు దర్శకులు తన ఫోటోను అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ, కోలీవుడ్ నుంచి షెడ్యూల్డ్ కులాలవారిని తొలగించాలంటూ ఆమె చెప్పిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా మారాయి.
ఈ వీడియో ఆధారంగా విదుతలై సిరుతైగళ్ పార్టీ నేత వన్నీ అరసు ఫిర్యాదు చేయగా, మీరా మిథున్ పై IPC సెక్షన్లు 153, 153A(1)(a), 505(1)(b), 505(2) తో పాటు SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అప్పట్లో మీరాతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన వీరిద్దరూ కోర్టు విచారణలకు గైర్హాజరయ్యారు , దాంతో కోర్టు సీరియస్‌గా తీసుకొని వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచే మీరా మిథున్ పరారీలో ఉంది. పోలీసులు ఎంత గాలించినా ఆమె ఆచూకీ కనిపించలేదు. నా కుమార్తె ఢిల్లీలో వీధుల్లో తిరుగుతోంది, దయచేసి ఆమెను రక్షించండి అంటూ మీరా తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మీరా మిథున్ గతంలో నన్ను అరెస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు , నా మీద చేయి వేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ట్యాగ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేయడం, పోలీసులపై ఆరోపణలు గుప్పించడం పెద్ద చర్చనీయాంశమయ్యాయి.