Allu Arjun Arrest | హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అల్లు అర్జున్ అరెస్టును పలువురు ప్రముఖులు తప్పుబట్టారు. ప్రభుత్వం అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే అరెస్టులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కార్యక్రమం వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని ట్వీట్ చేశారు. సినిమా ఓపెనింగ్ షో రోజు అగ్రహీరోలు ఆర్టీసీ క్రాస్ రోడ్‌కు రావడం 50 ఏళ్లుగా జరుగుతున్నదేనని మరో కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
అల్లు అర్జున్‌కు కనీసం సమయం ఇవ్వకుండా బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ఇండస్ట్రీ పట్ల కాంగ్రెస్ గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నదని, అల్లు అర్జున్ అరెస్టు ఇందుకు నిదర్శనమని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఇప్పుడు ఆ అపవాదును డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని సహాయం అందించాలని, ఈ దుర్ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినిమా ప్రముఖులపై దాడి నిత్యకృత్యంగా మారడం బాధాకరమని ఎక్స్ వేదికగా వాపోయారు. తొకిసలాటకు పోలీసు శాఖదే వైఫల్యమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అల్లు అర్జున్ను నేరుగా బాధ్యుణ్ని చేయడం, జవాబుదారీగా ఉంచడం అన్యాయం, అసమంజసమని తెలిపారు. సంధ్య థియేటర్‌కు లైసెన్స్ ఇచ్చినప్పుడు నిబంధనలను పాటించారా? ఒక రాజకీయ నాయకుడి ఊరేగింపులో తొకిసలాట జరిగితే ఆ రాజకీయ నాయకుడు బాధ్యత వహించాలా? అని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఎక్స్ వేదికగా స్పందించారు.