ప్రముఖ నటుడు మనోబాల (69) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఉష, కుమారుడు హరీశ్ ఉన్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మనోబాల 1979లో ‘పుతియ వార్పుగల్’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. దర్శకుడిగా 24 చిత్రాలను రూపొందించారు.
చిత్ర నిర్మాణంలోనూ ఆయన తన అభిరుచిని చాటుకున్నారు. నటుడిగా దాదాపు 300 చిత్రాల్లో నటించారు మనోబాల. పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితులైన మనోబాల తెలుగులో ‘మహానటి’, ‘దేవదాస్’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాల్లో నటించారు. మనోబాల మృతికి రజనీకాంత్, భారతీరాజా, అజిత్, వంటి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.