Manchu Manoj | టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి ఆయనకి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న మనోజ్ ఇటీవల భైరవం అనే చిత్రంతో పలకరించాడు. మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ అలరించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఒక పవర్ఫుల్ సినిమాతో రెడీ అయ్యారు. తాజాగా “డేవిడ్ రెడ్డి” అనే టైటిల్‌తో మనోజ్ 21వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి డైరెక్ట్ చేయగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విడుదలైన టైటిల్ పోస్టర్, మేకర్స్ విడుదల చేసిన సమాచారం ఈ ప్రాజెక్టుపై భారీగా ఆసక్తిని పెంచాయి.
ఈ సినిమా కథ 1897 నుంచి 1922 మధ్యకాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటూ, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడి కథగా ఇది తెరకెక్కుతోంది. మనోజ్ ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని లుక్‌లో, ఒక విప్లవవాది పాత్రలో కనిపించనున్నారు. “మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు… ఢిల్లీలో పెరిగాడు… ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు అనే స్టేట్మెంట్తో రివీల్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల భైరవం సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రశంసలు అందుకున్న మనోజ్, ఇప్పుడు మిరాయ్ అనే చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. అలాగే “డేవిడ్ రెడ్డి”లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నారు.
సినిమా కేవలం యాక్షన్ డ్రామా కాదు, ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన భావోద్వేగాలు, తాత్వికత కలగలిసిన హై ఓక్టేన్ డ్రామాగా రూపొందుతోందని తెలుస్తోంది.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మనోజ్ 21 సంవత్సరాల జర్నీని బ్యాంగ్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈసారి, ఒక నిర్భయ తిరుగుబాటు దారుడిగా వస్తున్నారు. #MM21 టైటిల్ ‘డేవిడ్ రెడ్డి’. ఇది 1897 – 1922 నేపథ్యంలో సాగే తీవ్రమైన చారిత్రక యాక్షన్ డ్రామా” అని చిత్రబృందం తెలిపింది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మనోజ్ కెరీర్లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా మనోజ్‌కి కంబ్యాక్ హిట్ ఇస్తుందా? అసలు “డేవిడ్ రెడ్డి” అనే పాత్రలో మనోజ్ ఎలా కనిపిస్తారు? అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.