మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖప్రజ్ఞతో రాణించిన శ్రీనివాసన్ (69) శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన 225పై చిలుకు చిత్రాల్లో నటించారు. 1956లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన అద్భుత ప్రతిభాపాటవాలతో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘వడక్కునొక్కి యంత్రం’ (1989) చిత్రం ఉత్తమ చలన చిత్రంగా కేరళ రాష్ట్ర అవార్డును సొంతం చేసుకుంది. శ్రీనివాసన్ కుమారుడు వినీత్ శ్రీనివాసన్ కూడా నటుడిగా రాణిస్తున్నారు. నటన, రచన, దర్శకత్వంతో పాటు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా శ్రీనివాసన్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. శ్రీనివాసన్ మృతిపట్ల దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మలయాళ సినీ పరిశ్రమ అద్భుత ప్రతిభాశాలిని కోల్పోయిందని అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంతాపం ప్రకటించారు.