విరామం దొరికితే చాలు.. ఫ్యామిలీతో ఫారిన్ చెక్కేయడం, కుటుంబసమేతంగా విహారయాత్రలు చేయడం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు పరిపాటే. అందుకే ఆయన్ను ఇండస్ట్రీలో అంతా కంప్లీట్ ఫ్యామిలీమ్యాన్‌గా అభివర్ణిస్తుంటారు. తాజాగా ఆయన జర్మనీ వెళ్లారు. అది కూడా విహారయాత్ర నిమిత్తమే అని అంతా అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. ‘వారణాసి’ సినిమా కోసం ట్రెక్కింగ్‌లో ట్రైనింగ్ తీసుకునేందుకు ఆయన జర్మనీ వెళ్లారు.
ప్రస్తుతం అక్కడ బ్లాక్ ఫారెస్ట్‌లో ఫిట్నెస్, వెల్నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ పొందుతున్నారు మహేశ్. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా స్వయంగా తన సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇక ‘వారణాసి’ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులందర్నీ ఆకర్షించడమే లక్ష్యంగా దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారతీయ పురాణేతిహాసాలను స్పృశిస్తూ, పలు దేశాలతో ముడిపడిన కథ కావడంతో ‘వారణాసి’పై మరింత శ్రద్ధ పెట్టారాయన.
ఇందులో మహేశ్ ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తారు. ఇప్పటివరకూ భారతీయ సినిమా విడుదల కాని దేశాల్లో కూడా ‘వారణాసి’ విడుదలయ్యేలా నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: దేవకట్టా, కెమెరా: పీఎస్ విందా, సంగీతం: ఎంఎం కీరవాణి, నిర్మాణం: శ్రీదుర్గా ఆర్ట్స్.