మహేశ్‌బాబు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. 2026లో ‘రాజమౌళి వారణాసి’ ఎలాగూ ఉంటుంది కదా.. దాంతో అభిమానుల ఆకలి తీరిపోతుందిలే అని అంతా అనుకుంటుంటే.. ఆ చిత్రబృందమే పేర్కొన్నదంటూ ఓ షాకింగ్ న్యూస్ తాజాగా వెలుగు చూసింది. అందుతున్న సమాచారం ప్రకారం 2026లో కూడా మహేశ్ సినిమా లేనట్టేనట. అయితే.. జూన్ 2026 నాటికి ఈ సినిమాకు సంబంధించిన తన పోర్షన్ మొత్తాన్నీ మహేశ్ కంప్లీట్ చేయనున్నారట. ఆ తర్వాత మిగిలిన షూట్‌ను పూర్తి చేసి 2027 మధ్యలో సినిమాను విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు వినికిడి. అభిమానులు ఆనందించే విషయం ఏంటంటే.. 2026లోనే మహేశ్ కొత్త సినిమా సెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట.
సాధారణంగా రాజమౌళి సినిమా ఒప్పుకున్న ఏ హీరో అయినా, ఇంత త్వరగా బయటికి రావడం అసంభవం. కానీ దాన్ని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సంభవం చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఏదేమైనా ప్రస్తుతం ఈ సినిమా కోసం కఠినమైన శిక్షణ తీసుకొని మరీ ది బెస్ట్ ఇస్తున్నారట మహేశ్. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: కె.ఎల్.నారాయణ, నిర్మాణం: శ్రీదుర్గా ఆర్ట్స్.