దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘SSMB29’ ప్రథమస్థానంలో ఉంటుంది. మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంతులేని అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం కసరత్తు మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం వారణాసి క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్‌ను వేస్తున్నట్టు సమాచారం.
ఈ సెట్లో జరిగే షెడ్యూల్లో కీలక తారాగణమంతా పాల్గొంటారని తెలుస్తున్నది. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వినికిడి. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఓ నవలను ప్రేరణగా తీసుకొని రచయిత విజయేంద్రప్రసాద్ ఈ కథ తయారు చేసినట్టు సమాచారం. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాలో పలు భాషలకు చెందిన భారతీయ నటులతోపాటు హాలీవుడ్ నటులు కూడా భాగం కానున్నారు. ఈ చిత్రానికి మాటలు: దేవకట్టా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.