మహేశ్‌బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘SSMB 29’(వర్కింగ్ టైటిల్) కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలా కాకుండా, ఈ సారి వేగంగానే సినిమాను పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని ఆయన ఫామ్ హౌస్‌లో ప్రత్యేకంగా ఓ రికార్డింగ్ స్టూడియోను నిర్మించారట. ఆ స్టూడియోలోనే ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యంలో ఈ సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం మొదలైందని తెలుస్తున్నది.
మరోవైపు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వందమందికి పైగా స్టంట్ మెన్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ జరుగుతున్నదట. దక్షిణాఫ్రికా టాంజానియాలో జరగబోయే భారీ షెడ్యూల్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తారని సమాచారం. ఆగస్ట్ రెండోవారంలో మొదలయ్యే ఈ షెడ్యూల్లో మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటారని తెలుస్తున్నది.
జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ అగ్రనటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ తండ్రిగా మాధవన్ కనిపించనున్నట్టు వార్తలొస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.