హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు షూటింగ్ వల్ల సోమవారం విచారణకు హాజరు కాలేకపోతున్నానని, మరో తేదీని ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆదివారం లేఖ రాశారు. దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది. మహేశ్‌బాబు సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు. అందుకు రూ.5.9 కోట్ల చెల్లించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. దీంతో మహేశ్‌బాబు తన పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ల పాస్‌బుక్స్‌తో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ29 సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో విచారణకు ఇప్పుడు రాలేనని మహేశ్ ఈడీకి విజ్ఞప్తి చేశారు. సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు అక్రమ లావాదేవీలకు సంబంధించి 100 కోట్ల రూపాయలకు బాధితులను మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి.