గత ఏడాది వచ్చిన ‘ఛావా’ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పుపొందారు బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ఖన్నా. తాజాగా ఆయన తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇస్తూ ‘మహాకాళి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన అసురుల గురువు శుక్రాచార్యుడిగా కనిపించనున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సూపర్‌హీరో చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ఖన్నాని పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. తపోవ్రత వస్ర్తాలు ధరించి, చీకటిని చీల్చే కాంతివంతమైన కళ్లతో శుక్రాచార్యుడి లుక్ ఆకట్టుకునేలా ఉంది.
దేవతలు, రాక్షసులు ఇద్దరి భవితవ్యాన్ని మలిచిన మహర్షిగా ఆయన్ని ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రలో చూపించబోతున్నామని, శుక్రాచార్యుడు కేవలం రుషి మాత్రమే కాదని.. జ్ఞానం, విశ్వాధికారానికి ప్రతీక అని మేకర్స్ తెలిపారు. ‘మహాకాళి’ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని, డిసెంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాత: రివాజ్ రమేష్ దుగ్గల్, క్రియేటర్: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.