MahaBharat | ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మైథలాజికల్ సినిమాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ‘రామాయణం’, ‘కార్తికేయ’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలకి వచ్చిన స్పందన చూస్తే, ప్రేక్షకులు తిరిగి పౌరాణిక చిత్రాలవైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ ను అధికారికంగా ప్రకటించారు. ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘ఒకే సినిమాతో మహాభారతం వంటి లోతైన కథను చూపడం సాధ్యం కాదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను సిరీస్ రూపంలో రూపొందించబోతున్నాం. ఆగస్టు నుంచి పనులు ప్రారంభిస్తాం, అని తెలిపారు.
ఈ కథను చెప్పడం ఎంతో క్లిష్టమైందని, కానీ తనకిది జీవితకాల లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడు లేదా అర్జునుడిగా కనిపిస్తారా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో స్టార్ నటులు ఎవ్వరూ ఉండరు. పాత్రలే నిజమైన హీరోలు. పూర్తిగా కొత్త నటులతోనే సినిమా రూపొందుతుంది,’’ అని స్పష్టం చేశారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, అమీర్ చేసే ప్రయోగాలకు ఇది నిదర్శనం. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మహాభారతం సిరీస్‌ను కనీసం ఐదు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్ ఉందని, ప్రతి భాగానికి సుమారు రూ.1,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం.
మొత్తం ప్రాజెక్ట్‌కు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ కోసం అమీర్ ఖాన్ తన ‘అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్’ తో పాటు, అంతర్జాతీయ స్టూడియోలు కూడా భాగస్వాములవుతాయని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్టింగ్ పనులు చాలా కాలంగా జరుగుతున్నాయి. ప్రముఖ రచయితలు, టెక్నికల్ టీమ్స్ ఈ కథను ఆధునికీకరించేందుకు శ్రమిస్తున్నారు. పాత్రల డెప్త్, ఇతిహాస విలువలను కాపాడుతూ.. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో సినిమా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారత సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అమీర్ ఖాన్ చివరిగా ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంకి మంచి స్పందన లభించింది. రూ.200 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది.