Maganti Gopinath | గత కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుగున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, టాలీవుడ్ నిర్మాత మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు తో ఏఐజీ ఆస్పత్రి లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తెలు అక్షర నాగ, దిశిర ఉన్నారు. అయితే గోపినాథ్ మరణంతో తెలుగు సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. మాగంటి గోపినాథ్ రాజకీయ నాయకుడిగానే కాకుండా సినీ పరిశ్రమలో కూడా తనదైన ముద్ర వేశారు. మాగంటి గోపినాథ్, తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
గోపినాథ్‌కి సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన పలు సినిమాలు కూడా నిర్మించారు. మాగంటి గోపినాథ్.. శ్రీ సాయినాధ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సురేష్, శ్రీకాంత్, నాగబాబు కీలక పాత్రల్లో 1995 లో పాతబస్తీ అనే సినిమాని నిర్మించారు . ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం రాజశేఖర్, కృష్ణ లతో RK ఫిలిమ్స్ బ్యానర్ పై 2000 సంవత్సరంలో రవన్న అనే సినిమాని నిర్మించారు. ఆ తర్వాత 2004 లో దివ్య అక్షర నాగ మూవీ బ్యానర్ పై తారకరత్నతో భద్రాద్రి రాముడు అనే సినిమాని నిర్మించారు. ఇక 2009 లో రాజశేఖర్ తో దిశిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నా స్టైలే వేరు అనే సినిమాని నిర్మించారు. అయితే ఈ నాలుగు సినిమాలు కూడా చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయాయి. దాంతో నిర్మాతగా తర్వాత సినిమాలు చేయలేదు.
మాగంటి గోపినాథ్ చాలా చలాకీగా ఉండేవారు. తన నియోజకవర్గంలోని ప్రజలతో చాలా సన్నిహితంగా ఉండేవారు. సమస్య విషయంలో తనని ఎవరైన సంప్రదిస్తే వెంటనే ఆ సమస్యకి పరిష్కారం చూపించేవారు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో రాజకీయాలలోను యాక్టివ్‌గా లేరు.గురువారం ఛాతీలో నొప్పి రావడంతో మాగంటి గోపీనాథ్ ఇంట్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గోపినాథ్‌ని ఆసుపత్రికి తరలించగా, సీపీఆర్ చేయడంతో పల్స్ రేటు పెరిగింది. దీంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసారు. పలువురు సినీ ప్రముఖులు సైతం గోపినాథ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.