‘పురుష సంతానోత్పత్తి అనే సమస్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. 140కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కడపడితే అక్కడ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. దానికి అనేక కారణాలు. అసలు కోవిడ్‌కు ముందు ఈ తరహా సమస్యల గురించి మాట్లాడటమే నేరంగా భావించేవారు జనం. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయారు. సమస్య ఎంతటి ఇబ్బందికరమైనదైనా చర్చించుకునేంత పరిపక్వత జనాల్లో వచ్చింది. సమస్యను చర్చిస్తూనే చక్కటి వినోదంతో ఈ సినిమా సాగుతుంది.’ అని మధురశ్రీధర్ రెడ్డి అన్నారు. నిర్వి హరిప్రసాదరెడ్డితో కలిసి ఆయన నిర్మించిన వినోదాత్మక చిత్రం ‘సంతానప్రాప్తిరస్తు’.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించారు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. ఈ నెల 14న విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రనిర్మాతలైన మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాదరెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘ఈ కథను కొందరు పెద్ద హీరోలకు వినిపించాం. కథ రీత్యా ఇందులో హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. బహుశా ఈ పాయింట్ కారణంగా వారంతా చేయడానికి వెనక్కి తగ్గారేమో. అందుకే కొత్తవాడైన విక్రాంత్‌తో చేశాం. దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఇప్పటి ట్రెండ్‌కు ఎలాంటి వినోదం అవసరమో అలాంటి వినోదంతో సినిమాను మలిచాడు. కథానుగుణంగా ఆర్గానిక్‌గా కామెడీ ఉంటుంది.’ అని చెప్పారు మధుర శ్రీధర్ రెడ్డి.
ఇందులో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంటుందని, ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ధైర్యాన్నిచ్చేలా సినిమా ఉంటుందని, రెండు తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 300 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నామని మధుర శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ‘సెన్సిబుల్ ఇష్యూని, సెన్సిటివ్‌గా చూపించిన చిత్రం ‘సంతానప్రాస్తిరస్తు’. మధుర శ్రీధర్‌గారితో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది. అసభ్యత లేకుండా, హద్దులు దాటకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించాం’ అని మరో నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి చెప్పారు.