దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘మా ఇంటి బంగారం’. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా పతాకంపై ఆమె నిర్మిస్తున్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. పల్లెటూరిలోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన సమంతకు అక్కడ ఎదురైన అనుభవాలతో టీజర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.
మా ఇంటి బంగారం అంటూ అత్తారింటి వారు ఆమెను ఆప్యాయంగా పిలుస్తుంటారు. పైకి అమాయకంగా కనిపిస్తూ అందరితో సఖ్యతగా ఉండే ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ చూపించిన యాక్షన్ ఘట్టాలు కథపై ఆసక్తిని పెంచాయి. టీజర్‌ని బట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఇదని అర్థమవుతున్నది. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్నందిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి సమంత ఈ చిత్రాన్ని నిర్మించారు.