ప్రముఖ గీత రచయిత గురుచరణ్(77) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖనటి ఎం.ఆర్. తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడే గురుచరణ్. ఎం.ఏ పట్టభద్రుడైన గురుచరణ్.. ప్రఖ్యాత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేశారు.
రెండు వందలకు పైగా పాటలు రాశారు. ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు అద్భుతమైన పాటలు రాశారు గురుచరణ్. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’, ‘కుంతీకుమారి తన జోరుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా..’ పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. గురుచరణ్ మరణం తెలుగు చిత్రపరిశ్రమకు నిజంగా తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.